వేడి కాఫీ, టీ తాగితే జీర్ణకోశ కేన్సర్‌!

21-03-2019: ఉదయం నిద్ర లేవగానే వేడి వేడి కాఫీ లేదా టీ తాగనిదే చాలామందికి రోజు మొదలవదు! అయితే ఇలా వేడివేడి కాఫీ, టీ తాగడం వలన జీర్ణకోశ కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అమెరికన్‌ కేన్సర్‌ సొసైటీకి చెందిన పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. అయితే 40 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసున్న 50 వేల మందికిపై పదేళ్లపాటు చేసిన తాజా అధ్యయనంలో జీర్ణకోశ కేన్సర్‌కు కారణాన్ని గుర్తించారు. ఈ సమయంలో జీర్ణకోశ కేన్సర్‌కు గురైన 317 మందిని పరిశీలించారు. 60 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ వేడి ఉన్న టీ, కాఫీని రోజూ 700 మిల్లీలీటర్ల మేర తాగే వారితో పోలిస్తే.. అంతకుమించిన వేడితో టీ, కాఫీ తాగే వారిలో జీర్ణకోశ కేన్సర్‌ వచ్చే ప్రమాదం 90 శాతం అధికంగా ఉన్నట్టు గుర్తించామని అమెరికన్‌ కేన్సర్‌ సొసైటీకి చెందిన శాస్త్రవేత్త ఫర్హాద్‌ ఇస్లామి చెప్పారు. కాఫీ, టీ ఇతర పానీయాలు వేడిగా ఉన్నప్పుడు కాకుండా కాస్త చల్లబడ్డాక తాగితే మంచిదని సూచించారు.