మందులు కాని మందులు

ఆంధ్రజ్యోతి, 15-01-2019: శత్రువును ఓడించాలంటే దాడి చేయాలి లేదా స్వశక్తితో శత్రువు భయపడి పారిపోయేలా చేయాలి. అయితే వైద్య విధానం ఇప్పటివరకూ మొదటి పద్ధతినే అనుసరిస్తూ వచ్చింది. కానీ రెండో పద్ధతితో అంతర్గతంగా మిత్ర బ్యాక్టీరియాను బలోపేతం చేయడం ద్వారా వ్యాధుల మీద విజయం సాధించవచ్చని పరిశోధనలు నిరూపించాయి. అలాంటి మిత్ర బ్యాక్టీరియాను పెంచేవే... ‘ప్రొబయాటిక్స్‌’!

 
ప్రతి ఒక్కరిలోనూ చెడు (పాథోజెన్స్‌) బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా ఉంటుంది. చెడు బ్యాక్టీరియాను దెబ్బ తీసే వైద్య విధానాల్లో మంచి బ్యాక్టీరియా కూడా మరణిస్తూ వచ్చింది. అంతకన్నా, మంచి బ్యాక్టీరియాను మరింత బలోపేతం చేయడం మేలు కదా! అనే ఆలోచనలు పరిశోధకుల్లో బలపడ్డాయి. ఆ పర్యవసానంగా వచ్చిందే ప్రొబయాటిక్స్‌ విధానం. సహజంగా మన పేగుల్లో విభిన్న రకాలకు చెందిన బ్యాక్టీరియా కోట్లలో ఉంటుంది. ఈ బ్యాక్టీరియాను ఫ్లోరా అని గానీ, మైక్రోబయోటా అని గానీ అంటారు.
వీటికి ఎదురే లేదు!
సహజంగా, మొత్తం జీర్ణవ్యవస్థకు కేంద్రంగా ఉండే గ్రహణి, ఈ ఫ్లోరా (మైక్రోబయోటా) పర స్పరంగా సత్సంబంధాలు కలిగి ఉంటాయి. మొత్తంగా చూస్తే ఈ మైక్రోబయోటా శరీరాన్ని చాలా బలంగానే ప్రభావితం చేస్తూ ఉంటుంది. అయితే, దీర్ఘకాలం కొనసాగే పోషకాహార లోపాలు, ఇన్‌ఫెక్షన్లు గానీ, వృద్ధాప్యం, ఒత్తిళ్లు, లేదా తరుచూ యాంటీబయాటిక్స్‌ తీసుకోవడం వంటివి గానీ, ఫ్లోరాలో సహజంగా ఉండే సమతుల్యతను దెబ్బ తీస్తాయి. ఈ పరిణామంతో స్థూలకాయం, మధుమేహం, పెద్ద పేగు కేన్సర్‌, పేగుల్లో వాపు ఏర్పడే ఇన్‌ఫ్లమేటరీ బావెల్‌ డిసీజ్‌, కొన్ని రకాల నరాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రొబయాటిక్స్‌ ఆ పరిస్థితికి తావులేకుండా, మైక్రోబయోటాను బలోపేతం చేస్తుంది.
రకరకాల సమస్యలకు ఒకటే మందు!
ప్రొబయాటిక్స్‌ తయారీ మూడు రకాలుగా ఉంటుంది. వాటిల్లో దోశ వంటి వాటికోసం పిండిని పులియబె ట్టడం, పెరుగు తయారు చేయడం, మార్కెట్‌లో లభించే కొన్ని రకాల సప్లిమెంట్ల ద్వారా ప్రొబయాటిక్స్‌ లభిస్తాయి. ప్రస్తుతం భారత దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఇటీవలి కాలంలో చాలా మంది డాక్టర్లు, తమ పేషంట్లకు పలువ్యాధుల చికిత్సగా ప్రొబయోటిక్స్‌నే సూచిస్తున్నారు. అతిగా తీసుకునే యాంటీబయాటిక్స్‌, వైరస్‌, ఇన్‌ఫెక్షన్ల వల్ల వచ్చే డయేరియా, ఇన్‌ఫ్లమేటరీ బావెల్‌ డిసీజ్‌ (ఐ.బి.డి) వంటి సమస్యలకు నివారణగానూ, చికిత్సగానూ ప్రొబయాటిక్స్‌ను సూచిస్తున్నారు. పసిపిల్లల మరణాల్లో డయేరియా వ్యాధులు ఒక ప్రధాన కారణంగా ఉంటున్నాయి. తరుచూ ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే వారిలో సహజంగానే పోషకలోపాలు ఏర్పడతాయి దీనివల్ల వారి ఎదుగుదల కుంటుపడుతుంది. శారీరక దృఢత్వంతో పాటు, వారి గ్రహణ శక్తి కూడా తగ్గుతుంది. వీటన్నిటికీ విరుగుడుగా ప్రొబయాటిక్స్‌ పనిచేస్తాయి. 
 
ప్రొబయాటిక్స్‌ 8 రకాల జీర్ణాశయ సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి. ఒక మోస్తరు వాపును, జీవక్రియల అసమానతల్ని తొలగిస్తాయి. జీర్ణాశయ కేంద్రమైన గ్రహణి ధాతు శక్తిని పెంచుతాయి.
 పదార్థాలను పులియబెట్టినప్పుడు మైక్రోబయాటా విడుదల చేసే కొన్ని రసాయనాలు గ్రహణిలో ఉండి పోతాయి. ఇవి వ్యాధినిరోధకశక్తిని ఒక దారికి తేవడంతో పాటు, వ్యాధికారక బ్యాక్టీరియాను అడ్డుకుంటూ, జీవక్రియల్ని క్రమబద్ధం చేస్తాయి. ప్రొబయాటిక్స్‌ ప్రాథమిక సమస్యలనే కాదు, పిల్లల్లో వచ్చే ఏ.డి.హెచ్‌.డి (అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌) అనే మానసిక రుగ్మతను కూడా అదుపులోకి తెస్తాయి.
 
ప్రొబయాటిక్స్‌ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే, ప్రవర్తనా సమస్యలు తొలగిపోవడంతో పాటు, మానసిక ఒత్తిళ్లు, ఆందోళన, మానసిక కుంగుబాటు వంటి రుగ్మతల నుంచి బయటపడే అవకాశం ఉంది.
 
రెండు మాసాల పాటు ప్రొబయాటిక్స్‌ తీసుకుంటే, స్ట్రెస్‌ హార్మోన్స్‌ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. డిప్రెషన్‌లోకి వెళుతున్న వాళ్లకు ప్రతిరోజూ ప్రొబయాటిక్‌ సప్లిమెంట్టు ఇస్తే, దిగులూ ఆందోళనా తగ్గి మనసు కుదుటపడటంతో పాటు కొన్ని పాజిటివ్‌ ప్రయోజనాలు కలుగుతాయి.

కేన్సర్‌ వైద్యంలో సైతం!
కే న్సర్లలో 20 శాతం బ్యాక్టీరియాల వల్ల వ చ్చేవే! ముఖ్యంగా హెలికోబ్యాక్టర్‌ పైలోరి, ఫూసోబ్యాక్టీరియా న్యూక్లియేటమ్‌, ఎప్‌స్టీన్‌ బార్‌ వైరస్‌ (ఇ.బి.వి), హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌.పి.వి) ఇవన్నీ కేన్సర్‌ కారకమైనవే.
 
ప్రొబయాటిక్స్‌ పేగుల్లోని మైక్రోబయోటాను, దాని జీవక్రియలను, వ్యాధినిరోధక శక్తిని ఉత్తేజితం చేయడం ద్వారా కేన్సర్‌ కారకాలను అరికట్టగలుగుతాయి.
 
శరీరంలోని హానికారకాల్ని నశింపచేసే సహజసిద్దమైన హంతక కణాలు (నేచురల్‌ కిల్లర్స్‌) కేన్సర్లు వైరస్‌లు, కేన్సర్‌ను పెంచే సైటోటాక్సిటీకి వ్యతిరేకంగా వ్యాధినిరోధక శక్తిని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వివిధ రకాల ప్రొబయాటిక్‌ బ్యాక్టీరియాకు ఈ హంతక కణాలను చైతన్యపరిచే శక్తి ఉంది. సర్జరీ ద్వారా తొలగించిన కొన్ని రకాల కణుతులు క్రమం తప్పకుండా ప్రొబయాటిక్స్‌ తీసుకోవడం ద్వారా మళ్లీ కనిపించలేదని, ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ కేన్సర్‌’ లోని ఒక వ్యాసం తెలిపింది.
 
ప్రొబయాటిక్స్‌ను సోయా పాలతో కలిపి తీసుకోవడం వల్ల రొమ్ము కేన్సర్‌ బారిన పడే వారి సంఖ్య సగానికి తగ్గిపోయిందని ‘కరెంట్‌ న్యూట్రిషన్‌ అండ్‌ ఫుడ్‌’ జర్నల్‌లోని ఒక వ్యాసం వివరించింది. ‘జర్నల్‌ ఆఫ్‌ కేన్సర్‌ ప్రివెన్షన్‌’ అనే జర్నల్‌లో 6 మాసాల పాటు ప్రొబయాటిక్స్‌ను తీసుకోవడం ద్వారా హెచ్‌.పి.వి, గర్భాశయ కేన్సర్లు నయమాయ్యయని ఒక వ్యాసం ప్రచురించింది.

ఇతర లాభాలూ ఉన్నాయి!
  • వ్యాధినిరోధక శక్తి తగ్గిన పెద్దవాళ్లలో గానీ, వ్యాధినిరోధక శక్తి ఇంకా బలపడని చిన్న పిల్లల్లో గానీ శ్వాసకోశాల్లో ఇన్‌ఫెక్లన్లు లేదా అలర్జీలు తలెత్తి ఉంటే అవి ప్రొబయాటిక్స్‌ ద్వారా తగ్గిపోతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
  • వర్జీనియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల వివరణను బట్టి ‘పాలిచ్చే తల్లుల్లో మైక్రోబయామ్‌ బ్యాక్టీరియా ఉంటే అది ఆమె సంతానంలో ఆటిజం గానీ, ఇతర నాడీ సంబంధిత వ్యాధులు రావడానికి మూలమవుతుంది.
  •  మైక్రోబయామ్‌, జీర్ణవ్యవస్థలోని గ్రహణిలోనూ, చర్మంలోనూ ఎక్కువ చురుకుగా ఉంటుంది. అందువల్ల జీర్ణాశయ సమస్యల కారణంగా యాంటీబయాటిక్స్‌ తీసుకుంటున్న వాళ్లు, వాటికి బదులుగా ప్రోబయాటిక్స్‌ తీసుకోవడం శ్రేయస్కరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. చర్మ సమస్యలను నయం చేయడంలో కూడా ప్రొబయాటిక్స్‌ బాగా పనిచేస్తాయి.