నిద్రను దూరం చేసే సోషల్‌ మీడియా?

14-02-2018: దూరంగా ఉన్న వారిని దగ్గర చేసే సోషల్‌ మీడియా నిద్రను మాత్రం దూరం చేస్తుంది అంటున్నారు జర్మన్‌ పరిశోధకులు. రోజులో గంట పాటు సోషల్‌ మీడియాలో సమయం గడిపేవారు నిద్రలేమికి దగ్గరవుతారని వారు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా యువత నిద్రలేమికి వాట్సప్‌లు, ఫేస్‌బుక్‌, స్నాప్‌చాట్‌లు కారణమని వారు చెబుతున్నారు. గంట కన్నా సోషల్‌ మీడియాలో ఎక్కువ సమయం గడిపే వారిలో నిద్రలేమితో పాటు పలు ఆరోగ్య సమస్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. సుమారు వంద మంది మీద వీరు అధ్యయనం నిర్వహించారు. వీరు సోషల్‌ మీడియాలో గడిపే సమయాన్నీ, నిద్రపోయే సమయాన్ని గమనించారు. గంట లేదా అంత కన్నా ఎక్కువ సేపు వాట్పస్‌, ఫేస్‌బుక్‌; ఛాటింగ్‌ చేసే వారు ఎనిమిది గంటలకన్నా తక్కువ నిద్రపోవడాన్ని గుర్తించారు. సోషల్‌ మీడియాలో తక్కువ సేపు గడిపేవారు గాఢ నిద్రపోవడాన్ని గమనించారు. ఈ రెండు గ్రూపుల నిద్ర పోయే సమయాలకి తేడా సోషల్‌ మీడియానే అని వారు స్పష్టం చేసుతున్నారు.