మెట్లెక్కితే చాలు!

25-05-2018: ఎంత కోరికగా ఉన్నా, జిమ్‌కు వెళ్లే టైమే ఉండటం లేదని దిగులు పడుతున్నారా? అవసరం లేదు. రోజూ ఒకటి రెండు సార్లు మెట్లు ఎక్కితే చాలు అంటున్నారు పరిశోధకులు. మెనోపాజ్‌ వల్ల సహజంగానే ఎముకలు బలహీనపడే అవకాశం ఉంది కనుక, కండరాలను పుష్టిగా మార్చుకోవడం ద్వారా ఎముకల్ని పటిష్టపరుచు కోవడం చాలా అవసర మని వారంటున్నారు. అందుకు రోజూ ఒకటి రెండుసార్లు మెట్లు ఎక్కడం ఎంతో అవసరం అంటున్నారు.

మెనోజాజ్‌ వల్ల కలిగే దుష్పరిణామాల్లో రక్తపోటు సమస్య తలెత్తుతుంది. కండరాల పనితనం కుంటుపడుతుంది. వీటన్నింటికి విరుగుడుగా మెట్లు ఎక్కే వ్యాయామం పనిచేస్తుంది. ఎందుకంటే దీనిద్వారా ఏరోబిక్‌, రెసిస్టెన్స్‌ వ్యాయామాల ఫలితాలు కూడా కలుగుతాయి. ఇవి గుండెకు ఆక్సిజన్‌ను చేరవేసే జీవ క్రియను చక్కబరుస్తాయి. వీటికి తోడు మెట్లు ఎక్కడం ద్వారా వార్థక్యం సమస్యలను కూడా చాలా వరకు నియంత్రించవచ్చునంటున్నారు, పరిశోధకులు. ఇన్ని ప్రయోజనాలున్న ఈ వ్యాయామాన్ని ఈ రోజే మొదలెడితే మేలు కదా!