సోషల్‌ మీడియాతో చిన్నారుల్లో మానసిక సమస్యలు

17-07-2019: గంటల తరబడి సోషల్‌ మీడియాలో గడపడం, ఎక్కువ సేపు టీవీ చూడడం చేసే చిన్నారులు నిరాశ, నిస్పృహ వంటి మానసిక సమస్యలకు గరయ్యే ప్రమాదం ఎక్కువని కెనడాలోని మాంట్రియల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియాలో ఇతరుల ఇష్టాలు, ఆకర్షణీయమైన జీవనశైలి వంటివి వారిపై తీవ్ర ప్రభావం చూపుతాయని వారు తెలిపారు. అలాగే ఎక్కువ సమయం ఫోన్లు, టీవీల ముందు గడపడం వలన స్ర్కీన్‌ వెలుతురు ప్రభావం కళ్లపై పడుతుందని హెచ్చరించారు. పరిశోధనల్లో భాగంగా 12 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న 3826 మంది పిల్లలను వారు పరిశీలించారు. వారు స్ర్కీన్‌ ముందు గడుపుతున్న సమయాన్ని బట్టి వారి మానసిక స్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నించారు. ఎక్కువ సమయం టీవీ చూస్తున్న, సోషల్‌ మీడియాలో గడుపుతున్న వారిలో మానసిక సమస్యలను గుర్తించినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.