కూర్చుంటే ఆయుఃక్షీణమే!

14-08-2019: కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయన్న సంగతి తెలిసిందే! అలాగే కదలకుండా గంటల తరబడి కూర్చుంటే మన జీవితంలో కొన్ని సంవత్సరాల ఆయుర్దాయాన్ని కోల్పోవలసి వస్తుందంటున్నారు పరిశోధకులు. కదలకుండా అదే పనిగా కూర్చునే వారి ఆరోగ్యం మీద తాజాగా అధ్యయనం చేశారు. సుమారు ఎనిమిదివేల మంది మీద అధ్యయనం నిర్వహించారు. వారి శరీరానికి ఓ పరికరాన్ని అమర్చి వారి కదలికలను పరిశీలించారు. వీరిలో 77శాతం మంది రోజులో ఎక్కువ శాతం కూర్చునేవారే ఉన్నారు. నాలుగు సంవత్సరాలు గడిచేసరికి వారిలో 340 మంది మృత్యువాత పడ్డారు. ప్రతి గంటకూ అటూ ఇటూ లేచి నడిచేవారిలో ఈ సమస్య గమనించలేదు. వీరిలో ఆరోగ్యసమస్యలున్నా, వాటి ప్రభావం నుంచి కొంత వరకూ తప్పించుకోవడాన్ని అధ్యయనకారులు గుర్తించారు. అరగంటకి ఓసారి లేచి అటూఇటూ తిరిగేవారి ఆయుష్షు ఎక్కువగానే ఉన్నట్లు గమనించారు. అంటే రోజంతా కూర్చునే ఉన్నాకూడా, మధ్యమధ్యలో లేస్తూ ఉండటం వల్ల మన ఆయుష్షు పెరుగుతుందన్నమాట.