మట్టితో ఊబకాయం మాయం!

20-03-2019: గతంలో వంటకీ మట్టి పాత్రలను మాత్రమే వాడేవారు. ఆ కాలంలో వారిలో ఆరోగ్యసమస్యలు తక్కువగా కనిపించేవి. ఇప్పుడా పాత్రలు మచ్చుకైనా కనిపించడం లేదు. బంకమట్టితో తయారు చేసిన పాత్రలో ఆహారం తింటేనే మనుషులు అంత ఆరోగ్యంగా ఉంటే.. బంకమట్టినే తింటే ఎలా ఉంటారన్న విషయం మీద ఎలుకల మీద ఓ అధ్యయనం చేశారు. రోజు మొత్తంలో కొద్ది మొత్తంలో బంకమట్టి తినడం ఆరోగ్యానికి మేలని, బంకమట్టి తింటే పొట్ట తగ్గుతుందని సౌత్‌ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలంటున్నారు. అయితే పొట్ట తగ్గుతుంది కదాని బంకమట్టిని నేరుగా తినకూడదనీ, పరీక్ష చేసిన బంకమట్టిని మాత్రమే తినాలని వారు సూచిస్తున్నారు. పరిశోధకులు కొన్ని ఎలుకలకు ఒబేసిటీ మెడిసిన్, మరికొన్ని ఎలుకలకు ప్రాసెస్డ్‌ బంక మట్టిని ఆహారంగా ఇచ్చారు. ఇలా రెండు వారాల అనంతరం మట్టిని తిన్న ఎలుకల్లో బరువు తగ్గడం గుర్తించారు. బంకమట్టిలోని సన్నటి మురికి లాంటి పదార్థం పేగుల్లోని కొవ్వును పీల్చేస్తుందనీ, అయితే ఇది మనుషల మీద ఎంత ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకోవడానికి మరిన్ని ప్రయోగాలు చేయాలని వారు చెబుతున్నారు. మట్టిని నేరుగా తినకపోయినా, మట్టి పాత్రలలో తయారు చేసిన ఆహారాన్ని తింటే బరువు సమస్య నుంచి తప్పించుకోవచ్చని వారు సూచిస్తున్నారు.