సైడ్ ఎఫెక్ట్స్‌లేని పాము విషం

19-10-2017: కిల్లర్స్ ఆఫ్ కిల్లర్స్‌గా పిలిచే అరుదైన నీలిపగడపు పాము విషం బాధానివారిణిగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పాము విషం నుంచి తీసిన ఔషధం నొప్పిని నివారించడంలో ప్రముఖపాత్ర పోషిస్తుందని వారు తెలిపారు. పైగా దీనివలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లుండవని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ పాముకున్న విషగ్రంథులు వాటి శరీరంలో 60 సెంటీ మీటర్ల వరకు విస్తరించి ఉంటాయి. అంటే దాని పొడవులో నాలుగింట ఒక వంతు ఉంటాయన్నమాట! నొప్పి నివారణ ఔషధాల్లో తప్పనిసరిగా ఉపయోగించే సోడియం పాళ్లు ఈ పాము విషంలో అధికంగా ఉంటాయి. దీనివల్ల నొప్పిని త్వరగా తగ్గించవచ్చని క్వీన్‌లాండ్స్ యూనివర్సిటీకి చెందిన బ్రాన్‌ఫై తన పరిశోధనల ద్వారా నిరూపించారు. అయితే ప్రస్తుతం ఈ పాముల సంఖ్య చాలా తక్కువగా ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.