మూత్రం మర్మం

19-06-2018: మూత్రం చిక్కదనం, రంగు, వాసనలు మన ఆరోగ్య పరిస్థితికి అద్దాల్లాంటివి. వీటి మీద అవగాహన ఏర్పరుచుకుంటే రుగ్మతలను ప్రారంభంలోనే గుర్తించవచ్చు. మరి మీ మూత్రంలో ఏ మర్మం దాగుంతో గ్రహించండి!
 
పారదర్శకం: మరీ నీళ్లలా పారదర్శకంగా ఉందంటే మీరు అవసరానికి మించి ద్రవాలు తీసుకుంటున్నారని అర్ధం. ఇదంత భయపడాల్సిన పరిస్థితి కాదు. కానీ ఓవర్‌ హైడ్రేషన్‌ వల్ల శరీరంలోని లవణాలు బయటికి వెళ్లిపోయి, రక్తంలో రసాయనిక అసమతౌల్యం ఏర్పడే అవకాశం ఉంటుంది.
 
లేత పసుపు: సమంగా ద్రవాలు తీసుకుంటున్నారని అర్ధం. ఈ రంగు మీరు ఆరోగ్యంగా ఉన్నారనడానికి సూచన.
 
ముదురు పసుపు: మీరు తగినన్ని నీరు తాగట్లేదని అర్ధం. ఫలితంగా మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశమూ ఉంటుంది. ఘనాహారం తక్కువ పరిమాణాల్లో తీసుకుంటూ ఆ స్థానాన్ని నీటితో భర్తీ చేయండి.
 
తేనె రంగు: మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురయిందని అర్థం.
 
ఎరుపు: మూత్రంలో రక్తం కలిసే ‘హెమటూరియా’ లక్షణమిది. వెంటనే యూరాలజిస్ట్‌ని కలవండి. ఇన్‌ఫెక్షన్‌, మూత్రపిండాల వ్యాధులు, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రనాళంలో కేన్సర్‌ గడ్డలు ఉన్నా మూత్రం ఎర్రగా మారుతుంది. ప్రోస్టేట్‌ గ్రంథిలో సమస్య తలెత్తినా మూత్రం ఎర్రగా ఉంటుంది.
 
నీలం: ‘హైపకాల్సీమియా’ (బ్లూ డైపర్‌ సిండ్రోమ్‌) అనే మెటబాలిక్‌ డిజార్డర్‌లో మూత్రం నీలంగా మారుతుంది.
 
ముదురు గోధుమ/నలుపు: కాపర్‌ పాయిజనింగ్‌ లేదా మెలనోమా రుగ్మతలకు గురైతే మూత్రం ఈ రంగుల్లోకి మారుతుంది. సాధ్యమైనంత త్వరగా వైద్యుల్ని కలవాలి.