10-10-2018: మెనోపాజ్(రుతుక్రమం ఆగిపోవడం) సమస్యలకు హార్మోన్ థెరపీ తీసుకుంటూంటారు. అయితే ఈ థెరపీ అవసరం లేకుండానే సమస్యల నుంచి బయటపడవచ్చంటున్నారు స్పెయిన్ పరిశోధకులు. మెనోపాజ్ సమస్యలు అధిగమించాలంటే రోజూ కొద్దిసమయం వ్యాయామం చేయాలని వారు సూచిస్తున్నారు. ఇందుకోసం సుమారు 300 మంది మహిళల మీద వీరు అధ్యయనం చేసారు. వీరిలో సగం మందికి రోజూ వ్యాయామం చేసే అలవాటు ఉంది. మిగతావారికి లేదు. వీరి చేత ప్రతిరోజూ గంట పాటు నడక, బ్రిస్క్ వాకింగ్ వంటి వ్యాయామాలు చేయించారు. కొన్ని రోజుల అనంతరం వీరిని పరిశీలించగా, అంతకు ముందు వీరిలో కనిపించిన ఆరోగ్య సమస్యలు చాలా వరకూ తగ్గిన విషయాన్ని వీరు గుర్తించారు. సాధారణంగా ఈ దశను ఎదుర్కొంటున్న స్త్రీలలో రాత్రి సమయంలో చమట పట్టడం, ఊబకాయం, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వీటిని అధిగమించాలంటే ప్రతిరోజూ కొద్దిసేపు వ్యాయామం చేస్తే చాలని వారు స్పష్టం చేస్తున్నారు.