చెట్లు ఎక్కితే జ్ఞాపకశక్తి!

15-08-2018: ‘చెట్లెక్కగలవా...నరహరి పుట్టలెక్కగలవా?’ అన్న పాటను చాలామంది వినే ఉంటారు. చెట్లు ఎక్కడం వలన శారీరకారోగ్యంతో పాటు మెద‌డుశ‌క్తి పెరుగుతుందని ప‌రిశోధ‌కులు తేల్చారు. చెట్టు ఎక్కి కొమ్మమీద నుండి ప‌డిపోకుండా జాగ్ర‌త్త‌గా నిల‌దొక్కుకోవ‌డం అనే శారీర‌క వ్యాయామం ద్వారా ఆ వ్య‌క్తిలో తెలివితేటలు, జ్ఞాపకశక్తి విశేషంగా పెరుగుతుంద‌ని నార్త్ ఫ్లోరిడాలోని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు.  అతి త‌క్కువసమయంలో వేగంగా చెట్ల‌ను ఎక్కే ప్ర‌క్రియ మ‌నిషిలో చురుకుదనాన్ని పెంచుతుందని వీరు చెబుతున్నారు. పరిశోధన నిమిత్తం 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసున్న కొంత మంది వ్య‌క్తుల‌ను ఎంపిక చేసుకుని వారికి ప‌లుర‌కాల టాస్క్‌లు ఇచ్చి వారి మెద‌డులో వ‌చ్చిన మార్పుల‌ను గ‌మ‌నించారు. చెట్లు ఎక్క‌డం, మూడు అంగుళాల వెడ‌ల్పు ఉన్న క‌ర్ర‌పై ప‌డ‌కుండా న‌డ‌వ‌డం, చెప్పులు లేకుండా ప‌రిగెత్త‌డం, బ‌రువుల‌ను ఎత్త‌డం ఇలా ప‌లుర‌కాల ప‌నులు చేయించారు. రెండు గంట‌ల త‌రువాత ప‌రిశీలించి చూస్తే వారిలో జ్ఞాప‌క‌శ‌క్తి 50శాతం పెరిగిన‌ట్టుగా గుర్తించారు. కాలేజీలో కూర్చుని రెండుగంట‌లు పాఠం విన్న వారిలో కంటే ఇలాంటి సాహసాలు చేసిన‌ వారిలో వ‌ర్కింగ్ మెమరీ పెరిగిన‌ట్టుగా గ‌మ‌నించారు.