తాగుడు మాన్పించే ‘లవ్‌ హార్మోన్‌’

18-04-2019: ‘లవ్‌ హార్మోన్‌’ ఆక్సిటోసిన్‌ ప్రేమానుభూతులు పెంపొందించేందుకే కాదు.. తాగుడు మాన్పించేందుకూ దోహదపడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. వాస్తవానికి మనిషిలో ప్రేమ, ఉద్వేగాలు ఉప్పొంగినప్పుడు మెదడు ఈ హార్మోన్‌ను స్రవిస్తుంది. అయితే అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌, స్ర్కిప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఇటీవల ఓ పరిశోధన నిర్వహించారు. ప్రయోగశాలలో కొన్ని ఎలుకలకు మద్యసేవనాన్ని అలవాటుచేశారు. కొంతకాలం తర్వాత రోజూ వాటి ముక్కుభాగంలో కృత్రిమ ఆక్సిటోసిన్‌ను స్ర్పే చేయడం ప్రారంభించారు. దీంతో క్రమంగా అవి మద్యం తాగడాన్ని తగ్గించినట్లు గుర్తించారు. మద్యానికి బానిసలైన వారిని, ఆ వ్యసనం నుంచి విముక్తులను చేయడానికి ‘లవ్‌ హార్మోన్‌ - నాసల్‌ స్ర్పే’ ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు.