విద్యావంతులకు దీర్ఘాయుష్షు!

14-10-2017: సాధారణ వ్యక్తులతో పోల్చితే విద్యావంతులకు ఆయుష్షు ఎక్కువని, అధిక బరువు, ధూమపానం ఆయుష్షును తగ్గిస్తాయని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. జీవితకాలాన్ని పెంచే జన్యువులకు సంబంధించి ఇంగ్లండ్‌లోని ఎడిన్‌బర్గ్‌ వర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. ముఖ్యంగా మనుషుల జీవితకాలాన్ని జీవన శైలి ప్రభావితం చేస్తుందని వారు తెలిపారు. స్కూల్‌ స్థాయిని దాటి ఎన్నేళ్లు ఎక్కువ చదివితే అనేళ్ల జీవితకాలం పెరుగుతందని చెప్పారు. సాధారణ బరువు కంటే కిలో ఎక్కువ ఉంటే రెండు నెలల జీవితకాలం తగ్గుతుందని, రోజుకు ప్యాకెట్‌ సిగరెట్లు తాగే వారికి ఏడేళ్ల జీవిత కాలం తగ్గుతుందని గుర్తించారు. సిగరెట్లు ఎక్కువ తాగే వారికి ఊపిరితిత్తుల కేన్సర్‌ ప్రమాదం పొంచి ఉంటుందని, తద్వారా జీవిత కాలం తగ్గుతుందని అన్నారు. శరీరంలో కొవ్వుతోపాటు మధుమేహం వంటివి జీవితకాలంపై దుష్ప్రభావాలు చూపిస్తాయని చెప్పారు.