ఐక్యూతో ఆయుష్షు

03-08-2017: ఐక్యూ ఎక్కువగా ఉండే పిల్లల్లో ఆయుర్దాయం ఎక్కువే అంటున్నారు స్కాట్‌ల్యాండ్‌ పరిశోధకులు. 1936లో జన్మించిన సుమారు అరవై వేల మంది స్త్రీ పురుషుల మీద సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించిన అనంతరం వీరు ఈ విషయాన్ని వెల్లడించారు. మంచి ఐక్యూతో ఎక్కువ ప్రతిభ కనపరచిన పిల్లలు పెద్దయిన తరువాత వారి ఆరోగ్యాన్ని పరిశీలించగా.... వీరిలో 28 శాతం మందికి శ్వాసకోస సంబంధ వ్యాధులు, 25 శాతం మందికి గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గిన విషయాన్ని అధ్యయనకారులు గుర్తించారు. కేవలం ఐక్యూ ఎక్కువగా ఉండడం వలనే వీరిలో ఈ మార్పు కనిపించిందా? అన్న విషయాన్ని మాత్రం వీరు స్పష్టం చేయలేదు. ఐక్యూ ఎక్కువగా ఉండే పిల్లలు అన్ని రంగాల్లోనూ మంచి మంచి విజయాలను సొంతం చేసుకోగలుగుతారు. ఆర్థికంగా, సామాజికంగా మంచి స్థాయికి చేరుకుంటారు కనుక వీరిలో ఒత్తిడి, ఆందోళన వంటివి తక్కువ స్థాయిలోనే ఉంటాయనీ అందువలన ప్రాణాంతకమైన జబ్బుల బారిన పడే అవకాశం తగ్గుతుందని అధ్యయనకారులు విశ్లేషిస్తున్నారు. దీని మీద ఇంకా అధ్యయనాలు నిర్వహించాలని వారు చెబుతున్నారు.