బద్ధకంతో ఎక్కువయ్యే జీవితకాలం

17-10-2018: బద్ధకస్తులని ఎవరూ ఇష్టపడరు. వారు ఎందుకు పనికిరారని ఈసడించుకుంటారు. కానీ అలాంటి వారే ఎక్కువ కాలం ఆరోగ్యంతో జీవిస్తారన్న విషయం తాజా పరిశోధనల్లో వెల్లడైంది. రోజులో ఎక్కువ భాగం ఏ పనీ చేయకుండా హాయిగా సోఫాలోనో, మంచం మీదో, పడక్కుర్చీ వేసుకునో పగలంతా అలా నడుం వాల్చి.. సాయంత్రం కాగానే రోడ్లన్నీ సర్వే చేసిమళ్లీ వచ్చి టీవీ చూస్తూ కాలక్షేపం చేసేవాళ్ళు పదికాలాలపాటు ఆరోగ్యంగా ఉంటారట! ఇలాంటి వారు మిగతావారితో పోల్చుకుంటే ఎక్కువ కాలం జీవిస్తారని యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్ శాస్త్రవేత్తలు తేల్చిచెబుతున్నారు. కొద్ది మంది మీద పరిశోధన చేసి చెప్పడం కాకుండా  299 రకాల జాతుల జీవక్రియ రేట్లను విశ్లేషించి మరీ స్పష్టం చేస్తున్నారు. జీవక్రియ రేటు ఎంత ఎక్కువగా ఉంటే జాతి అంతరించిపోయే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందట! ఎందుకంటే, శక్తిని ఎంత ఎక్కువగా వాడేసుకుంటే అంత త్వరగా అయిపోతుంది. అదే ఎక్కువ వాడకుండా దాచిపెట్టి ఉంచితే అలా నిలబడుతుంది. అందుకే అలా ఎక్కువగా కష్టపడకుండా.. హాయిగా, బద్ధకంగా గడిపేసే జీవజాతులు చాలా ఎక్కువ కాలం మనుగడ సాగిస్తాయని చెబుతున్నారు. అయితే దీని మీద ఇంకా పరిశోధనలు నిర్వహించాల్సి ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.