మోకాలి నొప్పులకు కారణం నిద్రలేమి?

10-08-2017: పెద్ద వారి నుంచి చిన్న వారి వరకూ ఎదుర్కొనే మోకాలి నొప్పులకు కారణం నిద్రలేమి అంటున్నారు బ్రిటన్‌ పరిశోధకులు. మనం మెలకువగా ఉన్న సమయంలో మోకాలి దగ్గర కణజాలం ఎక్కువగా చేరుతుందనీ, నిద్ర పోయే సమయంలో వెలువడే హార్మోన్లు ఆ కణజాలాన్ని కరిగిస్తాయని వీరు చెబుతున్నారు. ఈ కారణంగా మోకాలి నొప్పులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని వారు అంటున్నారు.. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న కొంత మంది మీద వీరు అధ్యయనం నిర్వహించారు. ఒక గ్రూపు వారిని సరిపడ నిద్ర పొమ్మన్నారు. రెండో గ్రూపు వారిని తక్కువ సేపు నిద్ర పొమ్మన్నారు. కొన్ని నెలల అనంతరం ఈ రెండు గ్రూపులను పరిశీలించారు. సరిపడ నిద్ర పోయిన వారిలో మోకాళ్ళ నొప్పులు తగ్గిన విషయాన్ని గమనించారు. నిద్ర తక్కువయిన వారిలో ఆ నొప్పులు కొద్దిగా ఎక్కువయిన సంగతిని గుర్తించారు. నిద్రపోయే సమయానికి, మోకాళ్ళ నొప్పులకు లింకు ఉందన్న విషయం వీరి అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఈ విషయాన్ని పూర్తిగా నిర్ధారించేందుకు మరిన్ని అధ్యయనాలు నిర్వహించాలని వారు చెబుతున్నారు.