నత్తల విషంతో మెరుగైన ఇన్సులిన్‌!

14-02-2019: సముద్రాల్లో ఉండే శంఖు ఆకారంలోని నత్తలు విడుదల చేసే విషంతో షుగర్‌ రోగులకు ఎంతో మేలు జరుగుతుందని తాజా సర్వే పేర్కొంది. ఇన్సులిన్‌ రూపంలో ఈ ఔషధం వేగంగా పనిచేస్తుందని ఉటా యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. వాస్తవానికి ఆహారం వేటలో ఈ నత్తలు చాలా తెలివిగా ప్రవర్తిస్తాయి. చేపల్ని వేటాడే క్రమంలో పరిసర నీటిలోకి విషాన్ని వదులుతాయి. అది ఆకర్షణ మంత్రంగా పనిచేసి ఆ ఉచ్చులో చేపలు చిక్కుకుంటాయి. దీంతో ఈ విషంపై పరిశోధన చేసిన అధ్యయనకారులు, వేగంగా స్పందించే ఇన్సులిన్‌ తయారు చేయవచ్చునని చెబుతున్నారు. టైప్‌ వన్‌ షుగర్‌తో బాధపడేవారు ఇన్సులిన్‌ కోసం రోజూ ఇంజెక్షన్లు చేసుకుంటారు. అలాంటి వారికి ఏడురకాల ఇన్సులిన్లు నత్త విషంలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ఔషధంతో ఎలుకలపై చేసిన ప్రయోగాలు ఆశించిన ఫలితాలు ఇచ్చాయన్నారు.