పళ్ళు తినకపోతే చనిపోతారట!

13-02-2019: వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ వార్త నిజమేనంటున్నారు ఆక్స్‌ఫర్డ్‌కి చెందిన పరిశోధకులు. పళ్లు తినడానికీ, దీర్ఘకాలం జీవించడానికి మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్రీయంగా నిరూపించే ప్రయత్నం చేశారు కొందరు పరిశోధకులు. ఇందుకోసం అయిదు లక్షలమంది చైనీయుల జీవితాలను పరిశీలించారు. వీరి ఆరోగ్యాన్ని ఏడేళ్లపాటు నిశితంగా గమనించారు. పరిశోధన మొదలుపెట్టిన సమయంలో ఈ అయిదు లక్షలమందిలోనూ రక్తపోటు, గుండెజబ్బులు లేవు.  వీరిలో 18.8 శాతం మందికి తరచూ పళ్లు తినే అలవాటు ఉంది. 6.4 శాతం మందేమో పళ్లని చాలా తక్కువగా తీసుకోవడమో లేకపోతే వాటి జోలికే పోకపోవడమో చేసేవారు. పళ్లు తినే అలవాటు ఉన్నవారిలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం 12 శాతం తక్కువగా ఉండటాన్ని గమనించారు.- అంతే కాకుండా వీరిలో గుండెజబ్బు లేకపోవడం, అకాల మరణాలు తక్కువగా ఉండడాన్ని వారు గుర్తించారు. ఇదంతా ప్రతిరోజూ ఏదో పండును తీసుకోవడం వలనే సాధ్యమయిందని వారు స్పష్టం చేస్తున్నారు.