నరాల పటుత్వానికి ఏం చేయాలంటే..

01-08-2017: ‘‘కాసేపు నడవగానే కాళ్లు గడగడా వణకడo, ఏ చిన్న బరువు లేపినా చేతులు జివ్వున లాగేయడం ఏమిటిదంతా? ఏ రోజుకారోజు ఇక ముందు ఎందుకూ పనికి రానేమోననే భావన పెరిగిపోతోంది. ఇలా అయితే ముందున్న జీవితాన్నంతా ఈడ్చేదెలా?’’ నరాల పటుత్వం కోల్పోయిన వాళ్ల నరకం ఇలానే ఉంటుంది!
మనిషిలో పనితనం తగ్గినప్పుడు, శరీరమంతా శక్తిహీనమైనప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు! ముఖ్యంగా ఒక నిర్దిష్టమైన వ్యాధి అంటూ కూడా ఏదీ బయటపడనప్పుడు, ఇంకేముంది? ఒళ్లు పట్టు తప్పిపోయిందీ అంటూ ఉంటారు. ఆ మాటకు అర్థం నరాలు చచ్చుబడిపోయాయనే! నరాలదో పెద్ద వ్యవస్థ. మంచి రక్తాన్ని గుండె నుంచి వివిధ అవయవాల కణజాలాలకు చేర్చేవాటిని ‘ధమనులు’ అనీ, ఆ కణజాలాల్లో విడుదలయ్యే వ్యర్థాలను, ఊపరితిత్తులకు, అక్కడి నుంచి గుండెకు కొనిపోయేవి ‘సిరలు’ అనీ పిలుస్తారు. ఈ రెంటినీ కలిపి రక్తనాళాలు అంటారు. నిజానికి నరాలనేవి మెదడులో పుట్టి, వివిధ అవయవాల రక్త, మాంసాది వివిధ కణజాలాలకు చేరి, ఆయా అవయవాల పనులను నియంత్రిస్తూ ఉంటాయి.
 
ఎప్పుడొస్తుందీ బలహీనత?
మనిషికి బలం అనేది తాను తిన్న ఆహార సారాం నుంచి వస్తుంది. దీన్నే ‘ఓజస్సు’ అంటారు. ఏ పని చేయాలన్నా ఇది అవసరమే. ఓజస్సును సప్తధాతువుల సారంగా చూస్తాం కాబట్టి, అన్ని ధాతువుల పోషణకూ అవసరమైన పోషకాంశాలు ఆహారంలో ఉండితీరాలి. అలా తీసుకునే ఆహారాన్నే సమతులాహారం అంటాం. అయితే ఆహార రస- రక్త ధాతువుల నుంచి పోషకాంశాలను తీసుకోవడంలో థైరాయిడ్‌ వంటి అంతఃస్రావ గ్రంథులు సహకరిస్తుంటాయి. అయితే ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఈ అంతఃస్రావాలు లోపిస్తే, కణజాల వ్యవస్థ బలహీనపడవచ్చు. నరాల బలం తగ్గిపోవ చ్చు.
 
రసాయన చికిత్సలు..
నరాలకు సంబంధించిన పక్షవాతం, క్యాల్షియం లోపంతో వచ్చే కీళ్లు, ఎముకల నొప్పులు (ఆస్టియో మలాసియా), ధాతుక్షయం, వెన్నెముకలో డిస్కు ఒత్తిళ్లు మరో ఎత్తు. ఇక సహజంగా వచ్చే వృద్ధాప్యం, దాని తాలూకు సమస్త నరాల సమస్యలు ఉండనే ఉన్నాయి. ఇన్ని కారణాలతో వచ్చే నరాల బలహీనతలను పారదోలి, నరాల పటుత్వాన్ని కూడదీయాలంటే, ఆహార పోషక లోపాలు, అంతఃస్రావ లోపాలు, ధాతు పరిణామ లోపాలను ముందు గుర్తించాలి. అయితే, వ్యాధి పేరుతో సంబంధం లేకుండా, జీర్ణ ప్రక్రియ నుంచి, ధాతు ప్రక్రియ దాకా అద్భుతంగా పనిచేసే ఔషధ వర్గాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. వీటినే ‘రసాయన వాజీకరణ’ చికిత్సలు అంటారు. వ్యాధులేవీ లేకున్నా, వ్యాధులు ఏర్పడక ముందే సూచన మాత్రంగా కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు గానీ, ఫలానా వ్యాది అని నిర్ధారణ అయినప్పుడు గానీ, రసాయన చికిత్సలు ఎంతో అద్బుతంగా తోడ్పడతాయి. వృద్ధాప్యాన్ని జయించడానికి కూడా తోడ్పడటం వల్ల వీటికి ‘జరాచికిత్సలు’ అన్న పేరు కూడా ఉంది. రసాయన ఔషధాల్లో ఉసిరితో చేసే ‘ఆమ్లకీ రసాయనం’, కరక్కాయతో చేసే ‘హరీతకీ రసాయనం’, గుంటగలగరాకుతో చేసే ‘భృంగరాజ రసాయనం’, పిప్పళ్లతో చేసే ‘చౌషష్టి పిప్పలీ రసాయనం’ ముఖ్యమైనవి. ఇవి కాక, ఖనిజ మూలకాలతో చేసే ‘ఆరోగ్య వర్ధనీ’, ‘ప్రవాళ పంచామృతం’, ‘గంధక రసాయనం’, ‘శిలాజిత్‌’ మరికొన్ని ఇతర రసౌషధాలన్నీ ‘రసాయనాలు’గా చెప్పబడతాయి, ఇవి పోగా అల్లం, నిమ్మకాయ రసంతో చేసిన ‘మాదీఫల రసాయనం’, ‘అర్జునారిష్ట’, ‘దశమూలారిష్ట’ వంటివి, లేహ్యరూపంలో ఉండే చ్యవనప్రాశ, అగస్త్య, భల్లాతక వంటి రసాయనాలు ఉన్నాయి.
 
సహజ మార్గంలో..
ఔషధ చికిత్సలు సరే! అందుకు భిన్నంగా, మందులతో పనిలేకుండా, అసలు వైద్యులతోనే పనిలేకుండా నరాల పటుత్వాన్ని పెంచే సహజమార్గాలు కూడా ఉన్నాయి. ఆహార, జీవనశైలిని మార్చుకోవడమే ఆ మార్గం. దీన్నే ఆచార రసాయనంగా పిలుస్తారు. ఆహారంలో పండ్లు, కూరగాయలతో కూడిన సాత్వికాహారం, అపక్వాహారానికి ప్రాధాన్యమిస్తూ, జీవనశైలిలో యోగాను జీవన విధానంగా చేసుకోవాలి. ప్రాణాయామంతో ఆక్సిజన్‌ సంపూర్ణంగా అంది, నరాలు ఉత్తేజంగా పనిచేస్తాయి. ఫలితంగా నరాల బలహీనత మటుమాయమవుతుంది.
ప్రొఫెసర్‌ చిలువేరు రవీందర్‌