గ్రీన్‌ టీ ఎంత వరకు మంచిది?

02-01-2019: పలు ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవడానికి చాలామంది గ్రీన్‌ టీని తాగుతుంటారు. అయితే దీన్ని తాగడం వలన పెద్దగా ఆరోగ్య ప్రయోజనాలు ఉండకపోవచ్చంటున్నారు నిపుణులు. గ్రీన్ టీ తాగడం వలన కేన్సర్ నుంచి తప్పించుకోవడంతో పాటు బరువును తగ్గించుకోవచ్చన్నది కొందరి నమ్మకం.  కానీ, ఇప్పటిదాకా దీనికి సంబంధించి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలూ లేవు. సరైన మోతాదులో తీసుకుంటేనే గ్రీన్ టీ ఉపయోగకరంగా ఉంటుంది తప్ప ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఇబ్బంది తప్పకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందులో ఉండే కెఫీన్ కారణంగా తలనొప్పి, నిద్రలేమి, వాంతులు, డయేరియాలాంటివి తలెత్తొచ్చు. బీపీ ఉన్నవాళ్లు గ్రీన్‌ టీ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్‌టీని ఎంత మోతాదులో తీసుకోవాలన్న దాని గురించి కూడా వైద్యుల సలహా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.