మధుమేహానికి కారణమయ్యే జన్యువు వల్లే హృద్రోగం!

06-09-2017: ప్రస్తుతం మానవాళికి పెనుముప్పుగా పరిణమించింది మధుమేహం. ఇప్పటి వరకు టైప్‌-2 డయాబెటిస్‌ వ్యాధికి గల కారణాలు పూర్తిగా తెలియలేదు. మరోవైపు హృద్రోగం కూడా ఎంతో మందిని బలితీసుకుంటోంది. అయితే తాజాగా ఈ రెండింటికీ జన్యు పరంగా కూడా సంబంధం ఉందని పెన్సిల్వేనియా వర్సిటీ పరిశోధకులు గుర్తించారు. టైప్‌-2 డయాబెటిస్ కు కారణమవుతున్న జన్యు పరివర్తనం కరోనరీ గుండె వ్యాధులకు కూడా కారణమవుతోందని వారు వెల్లడించారు. దక్షిణాసియా, ఐరోపాకు చెందిన దాదాపు పాతిక లక్షల మందిలో జన్యు శ్రేణిని పరీక్షించడం ద్వారా ఈ విషయాన్ని పరిశోధకులు కనుగొన్నారు. మధుమేహానికి కారణమయ్యే ఎనిమిది జన్యు వైవిధ్యాలు కరోనరీ హృద్రోగ సమస్యలకూ కారణమవుతున్నట్టు గుర్తించారు. ఈ రెండు ప్రమాదకర వ్యాధులకూ ఒకే ఔషధం ద్వారా చెక్‌ పెట్టొచ్చని వారు భావిస్తున్నారు.