సైకిల్‌తో ఆరోగ్యం!

14-08-2019: ఇరవై ఏళ్ల క్రితం, రోడ్డుమీద ఎక్కడ చూసినా సైకిళ్లే కనిపించేవి. ఇప్పుడు అంతా బైక్‌లే కనిపిస్తున్నాయి. బైక్‌లని కాస్త పక్కన పెట్టి సైకిలెక్కితే ఆయుష్షు పెరుగుతుందని అధ్యయనకారులంటున్నారు. బ్రిటన్‌లోని దాదాపు 22 ప్రాంతాలలో ఓ సర్వే నిర్వహించారు. రెండున్నర లక్షలమంది ఉద్యోగుల మీద ఓ ఐదేళ్ల పాటు నిర్వహించిన ఈ సర్వేలో దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. ఈ రెండులక్షల యాభైవేలమందిలో ఐదేళ్లకాలం ముగిసేసరికి 2,430 మంది చనిపోయారు. 3,748 మందికి కేన్సర్‌ సోకింది. 1,110 మంది గుండెజబ్బుల బారిన పడ్డారు. అయితే ఈ గణాంకాలకీ వారిలో సైకిల్ తొక్కడానికీ మధ్య సంబంధం ఉండటమే ఆశ్చర్యం కలిగించే అంశం. వాహనాల మీద ఆఫీసుకి వెళ్లేవారితో పోలిస్తే, సైకిల్‌ తొక్కేవారిలో కేన్సర్‌ సంభవించే అవకాశం 45 శాతం తక్కువని తేలింది. వీరిలో గుండెజబ్బు సోకే ప్రమాదం కూడా 46 శాతం తక్కువగా నమోదైంది. అంతేకాదు సైకిల్‌ మీద ప్రయాణం చేసేవారు, ఇతరులతో పోలిస్తే అర్థంతరంగా చనిపోయే ప్రమాదం దాదాపు 40 శాతం తక్కువని వెల్లడైంది. ఊబకాయం, పొగత్రాగడం, ఆహారనియమాలు పాటించకపోవడం వంటి సందర్భాలలో కూడా సైకిల్‌ తొక్కడం వల్ల లాభం కనిపించిందట.సాధ్యమైనంత వరకూ బైక్‌లని పక్కనపెట్టి సైకిల్‌ మీద ప్రయాణం చేయడం మంచిదని వారు సూచిస్తున్నారు.