సంగీతంతో సంతోషం!

14-08-2019: శాస్త్రీయ సంగీతాన్ని వినడం వల్ల జ్ఞాపకశక్తి, గ్రహణశక్తి మెరుగుపడతాయన్న విషయం ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. సంగీతం వినగానే మనసు సంతోషంతో నిండిపోవడం, ప్రతి ఒక్కరికీ అనుభవంలో ఉన్న విషయమే! ఇప్పుడు ఈ విషయాన్ని శాస్త్రీయంగా రుజువు చేసే ప్రయత్నం చేశారు ఫిన్లాండుకి చెందిన పరిశోధకులు. మెదడు మీద సంగీతపు ప్రభావాన్ని తేల్చుకునేందుకు ఇటలీలోని రెండు ఆసుపత్రులలోని రోగులకు మొదట సంగీతాన్నీ ఆ తరువాత సాధారణ శబ్దాలనూ వినిపించారు. ఈ రెండు రకాల ధ్వనులనూ వినేటప్పుడు వారి మెదడులో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గమనించారు. సంగీతం విన్నప్పుడు మెదడులో ఉండే డోపమైన్‌ అనే రసాయనంలో మార్పులు వస్తున్నట్లు తేలింది. మెదడులోని వివిధ కణాల మధ్య సమాచారాన్ని ప్రసారం చేసే రసాయనమే డోపమైన్‌. డోపమైన్ స్థాయి ఎక్కువైనప్పుడు మనిషి సంతోషంగా ఉంటాడు. సంగీతం విన్నప్పుడు ఈ డోపమైన్‌లో సానుకూల మార్పులు వస్తున్నాయని తేలింది. కర్ణకఠోరమైన శబ్దాలను విన్నప్పుడు డోపమైన్‌లో ప్రతికూలమైన మార్పులని గమనించారు.