నిద్ర మాత్రలతో మతిమరుపు

05-09-2018: నిద్రమాత్రలను అదేపనిగా వాడితే మతిమరుపు తప్పదంటున్నారు పరిశోధకులు. నిద్రమాత్రలు ఉపయోగించేవారిలో వచ్చే ఆరోగ్యసమస్యల మీద ఇటీవల అధ్యయనం చేసారు. నిద్రమాత్రలతో మిగతా ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నా వీరిలో మతిమరుపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధ్యయనకారులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు. సాధారణంగా వయస్సురీత్యా నిద్రపోయే సమయం తగ్గిపోతుందనీ, సరిపడ నిద్రపోవడానికి సహజ పద్ధతులు పాటించాలే తప్ప నిద్రమాత్రలు వాడకూడదని వారు అంటున్నారు. సుమారు నాలుగు లక్షల మంది వృద్ధుల మీద వీరు దీర్ఘకాలంపాటు అధ్యయనం నిర్వహించారు. వైద్యులు సూచించిన దానికన్నా ఎక్కువకాలం నిద్రమాత్రలు తీసుకున్న వృద్ధులలో మతిమరుపు సమస్య తలెత్తడాన్ని వీరు గమనించారు. వైద్యుల సూచనల మేరకే వీటిని ఉపయోగించాలి తప్ప సొంతంగా వీటిని వాడడం ప్రాణాంతకమేనని వారు స్పష్టం చేస్తున్నారు.