హెల్త్‌ ఈజ్‌ వెల్త్‌!

 

ఆంధ్రజ్యోతి, 08-01-2019: నిండైన ఆరోగ్యం వెలకట్టలేని నిధి! అది కలకాలం తరగకుండా ఉండాలంటే... శారీరక, మానసిక ఆరోగ్యాలు రెండూ జాగ్రత్తగా కాపాడుకోవాలి! అందుకు తగిన ఆరోగ్య సూత్రాలు తూచ తప్పక పాటించాలి!
 
ఏ చిన్న నలత అయినా దాని ప్రభావం జీవనసరళిని గాడి తప్పిస్తుంది. అలాగని నిండు ఆరోగ్యంతో కలకాలం కొనసాగడం ఒక్కరికీ సాధ్యం కాదు! కానీ అనారోగ్యపు ఒడుదొడుకుల్ని తట్టుకుని నిలబడేలా శరీరాన్ని సన్నద్ధం చేసుకోవడం మన చేతుల్లో పనే! ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆరోగ్యం పట్ల కనబరచిన నిర్లక్ష్యాలు, వాటి పర్యవసానాలు, స్వల్ప అవగాహనతో వాటిని నియంత్రించుకోగలిగే వెసులుబాట్లు కనిపిస్తాయి. ఆరోగ్యాన్ని చెక్కుచెదరకుండా ఉంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవడం మన విధి! అందుకోసం....
 
నీరు పుష్కలంగా!
దాహం వేసినప్పుడు తప్ప నీళ్ల జోలికి వెళ్లం! నిజానికి దాహం వేసిందంటే... అప్పటికే శరీర కణాల్లో నీటి శాతం తగ్గిపోయిందని అర్థం. కణాలు దాహంతో అల్లాడకుండా ఉండాలంటే, దాహం వేసేవరకూ ఆగకుండా, తరచుగా నీళ్లు తాగుతూనే ఉండాలి. శరీర జీవక్రియలు సక్రమంగా, సమర్థంగా జరగడానికి నీరు ఎంతో అవసరం. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లాలన్నా, పోషకాలు, ఆక్సిజన్‌ శరీరం మొత్తం అందాలన్నా తగినంత నీరు తాగాలి. మూత్రం, స్వేదం, ఊపిరి ద్వారా శరీరంలోని నీరు తరిగిపోతూ ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉండాలి. నీటి అవసరం... వాతావరణం, చేసే పని, శరీర బరువుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందుకు తగ్గట్టు సరిపడా నీరు తాగాలి. మూత్రం రంగును బట్టి తాగుతున్న నీరు సరిపోతుందో, లేదో తెలుసుకునే వీలుంది. మూత్రం నీరులా స్వచ్ఛంగా ఉందంటే మీరు తాగుతున్న నీటి పరిమాణం సరిపోతోందని అర్థం. మూత్రం పచ్చదనం పెరుగుతుంటే, నీళ్లు తాగడం పెంచాలి.
 
నిద్ర సరిపడా!
కంటి నిండా నిద్ర కరువైతే జీవక్రియలు గాడి తప్పుతాయి. ఆకలి క్రమం తప్పుతుంది. మెదడు చురుకుదనం తగ్గుతుంది. సామర్థ్యం సన్నగిల్లుతుంది. కాబట్టి బయలాజికల్‌ క్లాక్‌ దెబ్బతినకుండా ఉండడం కోసం వేళకు నిద్ర పోవడం తప్పనిసరి. అయితే పెరిగే వయసుతోపాటు నిద్ర కొందరికి సమస్యగా మారుతుంది. ఇందుకు కారణాలను కనిపెట్టి పరిష్కరించుకోవాలి. దానికితోడు నిద్రకు ఉపకరించేలా పరిసరాలను, జీవనశైలిని మార్చుకోవాలి. ఇందుకోసం...
  • ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్ర పోవడం అలవాటు చేసుకోవాలి.
  • నిద్రకు ముందు ఆందోళనకు గురిచేసే అంశాల గురించి ఆలోచించకూడదు.
  • గుండె వేగాన్ని పెంచే వీడియోగేమ్స్‌ ఆడకూడదు, సినిమాలు చూడకూడదు.
  • మనసును ప్రశాంతంగా ఉంచే సంగీతం వినాలి.
  • సెల్‌ఫోన్‌, మ్యూజిక్‌ సిస్టమ్‌, టీవీలకు పడగ్గదిలో చోటు కల్పించకూడదు.
 
కండరాలన్నీ కదిలేలా....
వ్యాధుల నుంచి రక్షణ కల్పించి, ఆయుష్షును పెంచే ఔషధం వ్యాయామం! వ్యాయామంతో ఎముకల సాంద్రత పెరుగుతుంది. కండరాల పటుత్వం పెరుగుతుంది. అధిక బరువు తగ్గి, ఒళ్లు తేలికవుతుంది. కాబట్టి దైనందిన కార్యక్రమాల్లో వ్యాయామానికి చోటు కల్పించాలి. అయితే వ్యాయామాన్ని శారీరక శ్రమగా భావించి, బద్ధకిస్తూ ఉంటాం! కానీ వ్యాయామాన్ని ఆనందంగా ఆస్వాదించే గుణం అలవరుచుకోవాలి. నడక, పరుగు, జిమ్‌లో వ్యాయామాలు, యోగా, ఏరోబిక్స్‌... వీటిలో నచ్చిన వ్యాయామాన్ని ఎంచుకోవాలి. వారంలో కనీసం ఐదు రోజులపాటు, రోజుకి 45 నిమిషాలపాటు వ్యాయామం చేయడం ఎంతో అవసరం. వ్యాయామాన్ని ఇష్టపడనివాళ్లు... తమకిష్టమైన సైక్లింగ్‌, ఈత, హైకింగ్‌, ట్రెక్కింగ్‌లనూ ఎంచుకోవచ్చు. ఎంచుకునేది ఎలాంటి వ్యాయామమైనా శరీరంలోని ప్రతి కండరం కదిలేలా ఉండాలి!
 
పండులా ఉండాలంటే...
విటమిన్లు, ఖనిజ లవణాల కోసం సప్లిమెంట్ల మీద ఆధారపడే బదులు తాజా పళ్లను ఎంచుకోవాలి. సాధారణంగా తినుబండారాల కోసం డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాం! కానీ అదే ఖర్చులో పళ్లు కొనడానికి వెనకాడతాం! నిజానికి ఫలహారం ఆరోగ్యకరం, పోషకనిలయం! మారే రుతువులతో మార్పులు చోటుచేసుకునే వాతావరణానికి తగ్గట్టు శరీరాన్ని సన్నద్ధం చేయగల పోషకాలు సీజనల్‌ ఫ్రూట్స్‌లో ఉంటాయి. కాబట్టి పళ్లు తినడం అలవాటు చేసుకోవాలి. సాఽధారణంగా భోజనం తర్వాత పళ్లు తింటూ ఉంటాం! కానీ పళ్లు పరగడుపునే తినాలి. ఉదయం అల్పాహారానికి ముందు తినడం అలవాటు చేసుకోవాలి. అలాగే తొక్క తీయకుండా, జ్యూస్‌ చేయకుండా, చక్కెర, ఉప్పు చేర్చకుండా తినాలి. చెట్టు నుంచి పండు కోసినప్పటి నుంచి దాన్లోని పోషకాలు నష్టమైపోతూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంతవరకూ తాజా పళ్లను ఎంచుకోవాలి.
 
మాంసం తినకపోయినా....
నీరసం, అలసట, నిద్రమత్తు, కళ్ల ముందు చీకట్లు కమ్మడం... ఇవన్నీ రక్తలేమి లక్షణాలు! ఈ ఇబ్బందిని అధిగమించడం తేలికే అయినా, మాంసకృత్తులను సమృద్ధిగా పొందాలంటే మాంసమే తినాలనే అపోహ వల్ల ఈ సమస్య సమస్యగానే మిగిలిపోతూ ఉంటుంది. మాంసకృత్తులు సమృద్ధిగా దొరికే కూరగాయలూ ఉన్నాయి. చిక్కుళ్లు, క్యాలీఫ్లవర్‌, పుట్టగొడుగులు, సబ్జా గింజలు, బాదం పప్పు, పచ్చి బఠాణీల్లో ప్రొటీన్లు ఎక్కువ.
 
 
శరీర తత్వాన్ని బట్టి...
తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గాలనే తాపత్రయం తగదు! అలాంటి ఆహార నియమాలు అందరికీ సరిపడకపోవచ్చు! ఒకరికి ఫలితాన్నిచ్చిన డైట్‌ పద్ధతి మరొకరికి అంతటి ఫలితాన్నే ఇవ్వకపోవచ్చు. కాబట్టి శరీర తీరు, తత్వాలను బట్టి, వైద్యులు సూచించిన డైటింగ్‌ పద్ధతిని అనుసరించాలి. శరీరానికి సరిపడా పోషకాలను అందిస్తూనే, అనవసర కొవ్వులను తగ్గించుకుంటూ, వ్యాయామం చేస్తూ అధిక బరువును తగ్గించుకోవడం ఆరోగ్యకరం. అధిక బరువు తగ్గాలనుకునేవాళ్లు... తాము తినే పదార్థాలు, వాటిలోని పోషక విలువలు, శరీరం శక్తిని ఖర్చు చేసే తీరు మీద అవగాహన ఏర్పరుచుకోవాలి. తీసుకునే ఆహారంలో సంక్లిష్ట కొవ్వులకు బదులుగా సాధారణ కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. మైదా, చక్కెరలను పూర్తిగా మానేయాలి. ప్రిజర్వేటివ్స్‌ కలిపిన ప్రాసెస్‌డ్‌ ఫుడ్స్‌, ప్యాకేజ్‌డ్‌ ఫుడ్‌ పూర్తిగా మానేయాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే తాజా పళ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.
 
-డాక్టర్‌ ఎమ్‌.గోవర్ధన్‌,
కన్సల్టెంట్‌ జనరల్‌ ఫిజీషియన్‌,
కేర్‌ హాస్పిటల్స్‌, నాంపల్లి, హైదరాబాద్‌.