కేన్సర్‌ను గుర్తించే ‘ఫ్లోరోసెంట్‌’

మండి(హిమాచల్‌ప్రదేశ్‌), ఏప్రిల్‌ 25: ప్రాణాంతక కేన్సర్‌ వ్యాధిని గుర్తించడంలో కాంతి ఉద్గార కర్బన నానోడాట్లు సహాయపడతాయని ఐఐటీ-మండి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జీవకణాల్లోని నీటి పంపిణీ శాతాన్ని ఫ్లోరోసెంట్‌ నానోడాట్లు బహిర్గతం చేస్తాయని శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ చయాన్‌ కె. నంది తెలిపారు. తద్వారా కేన్సర్‌ కణాలను గుర్తించవచ్చని పేర్కొన్నారు. పరిశోధనలో భాగంగా ఐఐటీ శాస్త్రవేత్తలు ఫ్లోరోసెంట్‌ నానోడాట్లను మానవ కణాలపై ప్రసరింపజేశారు. అప్పుడు కేంద్రకాల్లో నీటి శాతం తక్కువగా ఉన్న కేన్సర్‌ కణాలను గుర్తించారు.