అకాల మృత్యువుని దూరం చేసే పళ్ళు!

20-02-2019: ఈ మాట వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా  నిజమేనంటున్నారు ఆక్స్‌ఫర్డుకి చెందిన పరిశోధకులు. పళ్లు తినడానికీ, దీర్ఘకాలం జీవించడానికి ఉన్న సంబంధాన్ని శాస్త్రీయంగా నిరూపించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం ఐదు లక్షలమంది జీవితాలను పరిశీలించారు. వీరందరూ 30 నుంచి 79 ఏళ్ల లోపు వయసు కలిగినవారు. వీరి ఆరోగ్యాన్ని ఏడేళ్లపాటు నిశితంగా గమనించారు. పరిశోధన మొదలుపెట్టిన సమయంలో ఈ ఐదు లక్షలమందిలోనూ రక్తపోటు, గుండెజబ్బులు లేవు. వీరిలో 18.8 శాతం మందికి తరచూ పళ్లు తినే అలవాటు ఉంది. 6.4 శాతం మంది పళ్లని చాలా తక్కువగా తీసుకోవడమో లేకపోతే వాటి జోలికే పోకపోవడమో చేస్తుంటారు. పళ్లు తినే అలవాటు ఉన్నవారిలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం 12 శాతం తక్కువగా ఉండటాన్ని గమనించారు. ఇక పరిశోధన మొదలయ్యే సమయానికే పళ్లు తినే అలవాటున్న షుగర్‌ వ్యాధిగ్రస్తులలో ఆరోగ్యసమస్యలు తలెత్తకపోవడాన్ని గమనించారు. - అంతే కాకుండా తరచూ పళ్లు తినే అలవాటు ఉన్నవారు గుండెజబ్బులతో చనిపోవడం దాదాపు మూడోవంతు తక్కువగా కనిపించింది. -పళ్ళు తినడం అలవాటు చేసుకుంటే దీర్ఘకాలం ఆరోగ్యంతో జీవించవ్చని వారు స్పష్టం చేస్తున్నారు.