అధికంగా విటమిన్ టాబ్లెట్లు తీసుకుంటే అంతే సంగతులు..జరజాగ్రత్త

06-09-2017: మీరు విటమిన్ టాబ్లెట్లు, ప్రొటీన్లు, హెర్బల్ సప్లిమెంట్లు ప్రతీరోజూ తీసుకుంటున్నారా...అయితే జర జాగ్రత్త అంటున్నారు వైద్యనిపుణులు. డాక్టరు సలహా తీసుకోకుండా బలం కోసమని మల్టీవిటమిన్ టాబ్లెట్లు, ప్రొటీన్లు, సప్లిమెంట్లను ఎడాపెడా మింగితే ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరు క్రీడాకారులు, విద్యార్థులు అధికంగా విటమిన్లు, సప్లిమెంట్లు వాడుతున్న నేపథ్యంలో కొందరికి అంతర్గతంగా రక్తస్రావం సమస్య ఎదురవుతుందని వైద్యులు చెప్పారు. అధికంగా మల్టీవిటమిన్లు వాడితే వారిలో రక్తం గడ్డకట్టే వ్యవస్థ సజావుగా పనిచేయదని...దీనివల్ల క్రీడాకారులు ఆటలు ఆడుతున్నపుడు గాయాలైతే రక్తస్రావం ఆగదని వైద్యులు హెచ్చరించారు. ప్రస్థుతం మార్కెట్ లో లభ్యమవుతున్న రకరకాల సప్లిమెంట్ల తయారీలో ఏ ఏ పదార్థాలు వాడారో తెలియదని దీనివల్ల రియాక్షన్ ఏర్పడినపుడు ముప్పు ఉందంటున్నారు. హెర్బల్ ఉత్పత్తుల్లో ఏ ఔషధం ఉందో తెలియనందున అవి వాడిన వారికి ఏదైనా దుష్పరిణామం ఎదురైతే చికిత్స కష్టమని వైద్యులు అంటున్నారు. రోగి శరీరంలో ఉన్న ప్లేట్‌లెట్ కౌంట్, హీమోఫిలియా స్థాయిని బట్టి పెయిన్ కిల్లర్స్ తోపాటు ఇతర విటమిన్లను వాడమని వైద్యులు సూచిస్తుంటారు. వైద్యుల సూచనల మేరకే విటమిన్లు, సప్లిమెంట్లు, ప్రోటీన్లు వాడాలని వైద్యులు సూచించారు. మొత్తం మీద బలం కోసం వాడే విటమిన్లు, ప్రొటీన్లు, సప్లిమెంట్లు కూడా ఎడాపెడా వాడేవారు పారాహుషార్.