టైతో అనారోగ్యం?

15-08-2018: టై కట్టుకోవడం అన్నది ఇప్పటి ఫ్యాషన్‌. దీనికీ ఆరోగ్యానికి ఏమన్నా సంబంధముందా? అన్న విషయాన్ని తెలుసుకోవాలనుకున్నారు జర్మనీకి చెందిన కొంతమంది పరిశోధకులు. ‍దీనికోసం వాళ్లు ఓ 30 మందిని ఎంపిక చేసుకున్నారు. వీళ్లంతా 30 ఏళ్లలోపు ఉన్న ఆరోగ్యవంతులైన యువకులే. వీళ్లని రెండు గ్రూపులుగా విడదీశారు. మొదటి గ్రూపులో వాళ్లకి టై కట్టి, ఎంఆర్‌ఐ స్కాన్‌ తీశారు. ఈ స్కాన్‌లో ఆశ్చర్యం కలిగించే ఫలితాలు కనిపించాయి. చొక్కా పై గుండీ పెట్టుకుని, టై కాస్త బిగుతుగా కట్టుకున్నవాళ్లలో మెదడుకి చేరే రక్తప్రసారం పదిశాతం వరకూ తగ్గిపోయిందట. టైని కాస్త వదులు చేసిన తర్వాత కూడా ఓ పట్టాన రక్తప్రసారం సరికాలేదట! టై కట్టుకోని వాళ్ల ఎంఆర్‌ఐ  స్కాన్లు మాత్రం బాగానే ఉన్నాయి. మెదడుకి ఏకంగా పదిశాతం రక్తప్రసారం తగ్గిపోవడం అంటే మాటలు కాదు. ఈ కారణంగా బీపీ, షుగర్, గుండెజబ్బులు, ఆస్తమా లాంటి సమస్యలు ఉన్నవారికి మాత్రం ఇదేమంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతేకాకుండా టై బిగించి కట్టుకోవడం వల్ల కనుగుడ్ల మీద ప్రెషర్ పెరిగిపోతుందట. ఇది గ్లూకోమాలాంటి సమస్యలకు దారితీస్తుందట! అందువలన టై కట్టుకునేవారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వారు చెబుతున్నారు.