18-01-2018: మోనోసోడియం గ్లూటామేట్(ఎమ్సీజీ) ఉందని మ్యాగీని నిషేధించిన విషయం గుర్తుందా..! దానికే మరోపేరు అజినోమోటో. మన భాషలో చెప్పాలంటే చైనా ఉప్పు. చైనీస్ ఆహార పదార్థాల్లో ఎక్కువగా వాడే ఈ ఉప్పు.. రుచి కోసం మన కిచెన్లోకి కూడా చేరిపోయింది. అయితే, చైనా ఉప్పుతో మనం ఊహించినదానికంటే ప్రమాదం ఎక్కువని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో ఫ్రైడ్ రైస్ తయారీలో వాడే ఈ ఉప్పుతో తలనొప్పి, గుండె సంబంధిత వ్యాధులు, శారీరక అస్వస్థత వచ్చే ప్రమాదం ఉందట. అది నాడులను అవసరానికి మించి ప్రేరేపించడం వల్ల మానసిక రుగ్మతలకు దారి తీస్తుందట. ముఖ్యంగా చిన్న పిల్లలు, గర్భిణులు దీనికి దూరంగా ఉంటేనే మంచిది. అజినోమోటో క్లోమాన్ని అతిగా ఉత్తేజపరిచి ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా చేసి మధుమేహం వచ్చేలా చేస్తుందట. ఈ ఉప్పు ఎక్కువగా రెడీ టూ ఈట్ ఫుడ్, డీ హైడ్రేటెడ్ సూప్ ప్యాకెట్లు, ఇన్స్టంట్ నూడుల్స్, అన్ని రకాల సాస్లు, టమాట కెచ్పలో ఉంటుంది. చైనా ఉప్పులో దుష్ప్రభావాలున్నాయని గుర్తించిన పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అజినోమోటోను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అజినోమోటోతో దుష్ఫలితాలు
తలనొప్పి, నాడులు అతిగా ఉత్తేజితం అవుతాయి
గుండె సంబంధిత వ్యాధులు, ముఖంపై మంట
రక్తపోటు, థైరాయిడ్, మధుమేహం, ఆస్తమా
కంటి రెటీనాను దెబ్బ తీస్తుంది, కేన్సర్ ముప్పు