కొబ్బరినూనె ఆరోగ్యానికి మంచిదేనా?

02-01-2019: కొబ్బరి నూనెను వంటలలో వాడడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కొందరు నమ్మితే మరికొందరు దీని వలన ఎలాంటి ప్రయోజనం లేదని అంటూంటారు. మధుమేహం, గుండెజబ్బులు లేని 50-–75 సంవత్సరాల వయసున్న 94 మంది మీద ఇటీవల ఓ అధ్యయనం నిర్వహించారు. వీరందరినీ మూడు బృందాలుగా విభజించారు. నాలుగు వారాల పాటు ఒక బృందానికి 50 గ్రాములు, అంటే సుమారు 3 టేబుల్ స్పూన్‌ల ఎక్స్‌ట్రా వర్జిన్ కొబ్బరి నూనెను ఇచ్చారు. రెండో బృందానికి అంతే పరిమాణంలో ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనెను తీసుకోమని సూచించారు. మూడో బృందానికి రోజూ 50 గ్రాముల 'అన్‌సాల్టెడ్' వెన్నను తీసుకోమన్నారు. అనంతరం వీరిలో కొలస్ట్రాల్‌ స్థాయిని పరిశీలించారు. వెన్న తిన్నవారిలో సగటున పది శాతం ఎల్‌డీఎల్ పెరగ్గా, అదే సమయంలో హెచ్‌డీఎల్  కూడా అయిదు శాతం పెరిగింది. ఆలివ్ ఆయిల్‌ను తీసుకున్న వారిలో చాలా తక్కువ శాతమే అయినా ఎల్‌డీఎల్ తగ్గగా, హెచ్‌డీఎల్ అయిదు శాతం పెరిగింది కానీ అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన ఫలితాలు కొబ్బరినూనెలో వెలువడ్డాయి. ఎల్‌డీఎల్ పరిమాణం పెరగకపోవడమే కాకుండా, హెచ్‌డీఎల్, అంటే మంచి కొలెస్టరాల్ 15 శాతం పెరిగినట్లు తేలింది. అంటే కొబ్బరి నూనెను తీసుకుంటున్న వారికి గుండెజబ్బు లేదా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందన్న మాట.