పెడల్‌ డెస్క్‌లతో అనారోగ్య సమస్యలకు చెక్‌!

12-11-2018: గంటల తరబడి ఒకేచోట కూర్చొని పనిచేసే ఉద్యోగులకు శారీరక శ్రమ లేకపోవడం వలన ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే నిశ్చలఉద్యోగులు పెడల్‌ డెస్క్‌లు వినియోగిస్తే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుందని అమెరికాలోని మసాషుసెట్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు కొందరు నిశ్చల ఉద్యోగులకు పనిచేసే సమయంలో పెడలింగ్‌ టాస్క్‌ ఇచ్చారు. సాధారణ డెస్కులపై పనిచేసిన వారితో పోలిస్తే పెడల్‌ డెస్క్‌లు వినియోగించిన వారిలో భోజనం తర్వాత ఇన్సులిన్‌ స్థాయి తగ్గినట్టు వారు కనుగొన్నారు. అలాగే పెడలింగ్‌ చేయడం వలన పనిలో తగ్గుదల ఏమీ కనిపించలేదని గ్రహించారు. కాబట్టి గంటల తరబడి ఒకేచోట కూర్చొని పనిచేసినప్పటికీ పెడల్‌ డెస్క్‌ల సాయంతో శరీరానికి శ్రమ కల్పిస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని పరిశోధకుల్లో ఒకరైన స్టువర్ట్‌ చిప్కిన్‌ పేర్కొన్నారు.