ఎక్కువసేపు టీవీ చూస్తే రక్తం గడ్డకడుతుంది

24-02-2018: గంటల తరబడి కూర్చొని టీవీ చూస్తున్నారా? కంప్యూటర్‌పై పని చేస్తున్నారా? అయితే, రక్త సరఫరా మందగించి సిరల్లో నెత్తురు గడ్డకట్టుకుపోయే (వీటీఈ) ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాళ్లకు, పాదాలకు రక్త సరఫరా మెరుగ్గా జరగక మోకాళ్ల వద్ద, నడుము భాగంలో రక్తం గడ్డకడుతుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసోటా పరిశోధకులు తెలిపారు. ఒక చోట రక్త సరఫరా సరిగా జరగకపోతే ఆ స్థానంలో రక్తం గడ్డకట్టుకుపోవడమే కాకుండా శరీరంలోని మరోచోట కూడా గడ్డకట్టుకుపోయే ప్రమాదం ఉందని వెల్లడించారు. 45-64 మధ్య వయసున్న 15వేల మందిని పరీక్షించగా టీవీకి అతుక్కుపోయే వారిలో వీటీఈ సమస్య 1.7రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని వివరించారు. రక్తం గడ్డ కట్టకుండా ఇంట్లోనే కొన్ని ఆయుర్వేద మందులు వాడొచ్చు. పరిస్థితి అదుపు తప్పుతుందని తెలిస్తే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.

 
రక్తం గడ్డ కట్టకుండా చేసే పదార్థాలు
పసుపు: పసుపులోని కర్క్యుమిన్‌ రసాయనం రక్త ఫలకికలపై పనిచేసి రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. గడ్డ కట్టినపుడు వచ్చే నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
కారం: రక్తాన్ని పలుచగా మార్చుతుంది. అందులో ఉండే ‘సిలిసిలేట్‌’ శరీరంపై మంచి ప్రభావం చూపుతుంది.
వెల్లుల్లి: వెల్లుల్లిలో ఉండే సల్ఫర్‌ సమ్మేళనాలు రక్తం గడ్డ కట్టకుండా చేస్తాయి. రోజూ ఉదయం ఒక వెల్లుల్లి పాయ తింటే ప్రయోజనం ఉంటుంది.