డైట్‌ సోడాతో అంధత్వం?

20-02-2019: డైట్‌ సోడాపేరుతో మార్కెట్లో లభ్యమవుతున్నవి ఆరోగ్యానికి అంత మంచివి కావంటున్నారు పరిశోధకులు. డైట్‌ సోడా పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్నారనీ, వీటిని తీసుకోవడం వలన శరీరంలో షుగర్‌ స్థాయి పెరిగిపోతుందనీ, దీని  కారణంగా కొన్నిసార్లు అంధత్వం సంక్రమించే ప్రమాదం కూడా ఉందని వారు అంటున్నారు. సుమారు 600 మంది షుగర్‌ వ్యాధిగ్రస్తుల మీద వీరు అధ్యయనం నిర్వహించారు. వీరిలో 73 మంది టైపు 2 డయాబెటీస్‌తోనూ, మిగతా వారు టైప్‌ 1 డయాబెటీస్‌తోనూ బాధపడుతున్నవారున్నారు. వీరికి కొన్నిరోజుల పాటు డైట్‌ సోడా ఇచ్చారు. అనంతరం వీరి ఆరోగ్యాన్ని పరిశీలించగా, వీరిలో పదిశాతం మందికి కంటి సంబంధ సమస్యలున్నాయని గుర్తించారు. ఈ సమస్యలు శాశ్వత అంధత్వానికి దారితీయవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. సాధారణ సాఫ్ట్‌ డ్రింకులు కలిగించే నష్టాన్నే డైట్‌ సోడా కలిగిస్తుందనీ, దీని వలన ఆరోగ్యానికి హాని కలిగే అవకాశాలే ఎక్కువని వారు స్పష్టం చేస్తున్నారు. అంతే కాకుండా డైట్‌ సోడా తీసుకోవడం వలన ఊబకాయం, అధికబరువు రాదన్న గ్యారంటీ లేదని వారు అంటున్నారు.