యాంటీబయోటిక్‌ నిరోధకతను గుర్తించే సెన్సర్‌!

23-09-2017: యాంటీబయోటిక్‌ నిరోధకతను త్వరితగతిన గుర్తించే ఓ కొత్త సెన్సర్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ద్వారా గంటలోనే ఫలితాన్ని తెలుసుకోవచ్చు. తద్వారా తొందరగా వైద్య సహాయాన్ని తీసుకోవచ్చు. దీన్ని అమెరికాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాండర్డ్స్‌ అండ్‌ టెక్నాలజీ (నిస్ట్‌) పరిశోధకులు రూపొందించారు. సాంప్రదాయ యాంటీ మైక్రోబియల్‌ పరీక్ష విధానాల ద్వారా ఫలితం రావడానికి రోజుల సమయం పడుతోంది. దీంతో యాంటీబయోటిక్‌ నిరోధకతకు గురైన వారు ప్రమాదకర ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారు. కొత్త సెన్సర్‌ శరీరంలోని ఇన్ఫెక్షన్లకు కారణమైన బ్యాక్టీరియా కణాలు.. యాంటీబయోటిక్స్‌కు ఎలా ప్రతిస్పందిస్తున్నాయో గంటల వ్యవధిలోనే గుర్తిస్తుంది. యాంటీ బయోటిక్‌ నిరోధకతతో ఒక్క అమెరికాలోనే ఏడాదికి 20 లక్షల మంది ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారు. 23 వేల మంది మృత్యువాత పడుతున్నారు.