మగతతో అల్జీమర్స్‌!

10-10-2018: చాలా మందిని భయపెడుతున్న అల్జీమర్స్‌కు వృద్ధాప్యం, ఇతర ఆరోగ్యసమస్యలే కారణం అన్న సంగతి చాలా మందికి తెలుసు. కానీ పగటి సమయం అంతా మగతతో ఉండేవారు అల్జీమర్స్‌ బారిన త్వరగా పడతారని అధ్యయనకారులు స్పష్టం చేస్తున్నారు. అరవై సంవత్సరాలకు పైబడిన ఐదువందల మంది మీద వీరు పదిహేను సంవత్సరాల పాటు అధ్యయనం చేసారు. వీరి ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పరిస్థితి, నిద్రపోయే సమయాలను పరిశీలించారు. మామూలుగా అరవై సంవత్సరాల పాటు పైబడిన వారు పగటి సమయంలో గంటా లేదా అరగంట పాటు చిన్నపాటి కునుకు తీస్తారు. ఈ విధంగా రెండు మూడు సార్లు చిన్నపాటి కునుకు తీయడం వలన ఎలాంటి  ప్రమాదమూ లేదనీ, అలా కాకుండా రోజంగా మగతా ఉండేవారిలో అల్జీమర్స్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వీరు గుర్తించారు. రోజంతా మగతగా ఉండే సమస్య అరవై సంవత్సరాలు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపిస్తుందనీ, ఇలాంటి వారు ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని వారు సూచిస్తున్నారు.