ఆల్కహాల్‌ నాణ్యతను పరీక్షించే కొత్త పరికరం

23-09-2017: మందుబాబులకు శుభవార్త. మీరు తాగుతున్న ఆల్కహాల్‌ కల్తీదా.. కాదా? సులభంగా తెలుసుకునేందుకు ఓ సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు తయారుచేశారు. దీంతో బాటిల్‌లో ఉండగానే విస్కీ లేదా వోడ్కా నాణ్యతను పరీక్షించవచ్చు. ఓ లేజర్‌ కిరణాన్ని గ్లాస్‌ బాటిల్‌లోకి పంపించడం ద్వారా దానిలో రసాయన మిశ్రమాల సమాచారాన్ని వెల్లడిస్తుంది. ఇలాంటి పరికరాలు ఇంతకుముందే అందుబాటులోకి వచ్చినా ఇప్పటివరకు వాటిని ఔషధ, రక్షణ రంగంలో మాత్రమే వాడుతున్నారు. తాజాగా ఆహారం, ద్రవపదార్థాల నాణ్యతను సులభంగా పరీక్షించేందుకు అలాంటి పరికరాన్నే మాంచెస్టర్‌ యూనివర్సిటీ పరిశోధకులు తయారుచేశారు. ‘ప్రస్తుతం ఆల్కహాల్‌లో మిథనాల్‌ను అధికస్థాయిలో కలుపుతున్నారు. కల్తీని అరికట్టడంలో ఈ పరికరం సమర్థంగా పనిచేస్తుంద’ని మాంచెస్టర్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.