జుట్టు రాలుతోంది... ఏం చేయాలి?

16-06-2018: మా అబ్బాయికి 24 ఏళ్లు. ఈ వయసు నుంచే బట్టతల మొదలయ్యింది. నివారణకు డైట్‌ చెప్పండి.
మా అబ్బాయికి 28 ఏళ్లు. జుట్టు విపరీతంగా ఊడుతోంది. ఏం చేయాలి?
మా అమ్మాయికి 21 ఏళ్లు. జుట్టు డ్రైగా ఉండటమేగాక చిట్లిపోతోంది. జుట్టు ఊడిపోతోంది. ఎలాంటి డైట్‌ అవసరం?
మా అబ్బాయికి 19 ఏళ్లు. జుట్టు పలుచబడుతోంది... ఏం చేయాలి?
 
ఈ సమస్యపై చాలా మెయిల్స్‌ వస్తున్నాయి. జుట్టు రాలడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా మారింది. వయస్సుతో పాటు ఆడ మగ తేడా లేకుండా జుట్టు రాలుతుంది. జుట్టు రాలడం అనే సమస్యతో కనీసం 80 శాతం మంది బాధపడుతున్నారు. రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం మామూలే. అయితే అంతకుమించి రాలుతుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
 
జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు: జీన్స్‌, ఒత్తిడి, కాలుష్యం, పోషకాహారలోపం, నిద్రలేమి, చెడు అలవాట్లు.
వంశపారంపర్యంగా బట్టతల ఉంటే, హార్మోన్‌ తేడా జుట్టు రాలడాన్ని ఎక్కువ చేస్తుంది. అందువల్ల చిన్న వయసులోనే జుట్టు రాలడం మొదలవుతుంది. ఇక్కడ హార్మోన్‌ కరెక్షన్స్‌ చేయాలి.
ఒత్తిడి వల్ల తలపై చర్మానికి (స్కాల్ప్‌) అందవలసిన పోషకాలు అందకపోవడం వల్ల జుట్టు రాలిపోతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడం, పోషకాహారం ముఖ్యం.
కాలుష్యం వల్ల జుట్టు పొడిగా అవడం, పోషకాలు సరిగా అందకపోవడం, అవసరం లేని రసాయనాలు అడ్డుపడటం వల్ల జుట్టు రాలిపోతుంది. కాలుష్యం నుంచి కాపాడుకోవాలి. మంచి గాలి పీల్చడం, నార్మల్‌ వాటర్‌ తాగడం చేయాలి.
ఆహారలోపం ఎందుకొస్తుందంటే సమయానికి ఆహారం తినకపోవడం, సరైన పోషకాలు అందకపోవడం. దీని వల్ల జుట్టు పెరగడం తగ్గుతుంది. ఎక్కువగా రాలుతుంది. ఇది ఎక్కువగా ఆడవాళ్లలో కనిపిస్తుంది. కారణం ఏమిటంటే రక్తం తక్కువ శాతం ఉండటం. థైరాయిడ్‌ సమస్య వల్ల కూడా జుట్టు రాలుతుంది.
నిద్ర లోపం వల్ల పోషకాలు జుట్టు మొదలుకు సరిగా చేరకపోవడం, కణజాలానికి రిపేర్‌ జరగకపోవడం వల్ల జుట్టు రాలుతుంది.
పొగ త్రాగడం, మద్యం సేవించడం వల్ల కూడా జుట్టు రాలే అవకాశం ఉంది. పోగ త్రాగడం వల్ల జుట్టు మొదళ్లకి ఆక్సిజెన్‌ సరిగా చేరదు. అలాగే మద్యం తీసుకోవడం వల్ల పోషక లోపం వస్తుంది. వీటివల్ల జుట్టు రాలిపోయే అవకాశం ఉంది. 
ప్రధానంగా తీసుకోవాల్సిన పోషకాలు:
విటమిన్‌ బి3, బి5, ఇలు తీసుకోవాలి. ఇవి చికెన్‌, ఫిష్‌, నట్స్‌, సోయా, ఆకుకూరల్లో లభ్యమవుతాయి.
ఐరన్‌, జింక్‌లు గుడ్డు పచ్చ సొనలో బాగా ఉంటాయి.
మెగ్నీషియం పాలు, అరటిపండు, బీన్స్‌ చేపలలో ఉంటుంది.
ప్రొటీన్స్‌ గుడ్లు, పప్పు దినుసులు, మాంసాహారం, సోయాలలో బాగా లభిస్తాయి.
సరైన పోషకాహారంతో పాటు, హెయిర్‌ కేర్‌ కూడా అవసరం. వారానికి మూడు రోజులు తలకి నూనె పెట్టుకుని శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్‌
drjanakibadugu@gmail.com