శిరోజాలుఅందంగా ఉండాలంటే ?

ఆంధ్రజ్యోతి,04-04-2017: జుత్తు ఊడిపోవడం  ఇప్పుడు అతి సాధారణ సమస్యగా మారిపోయింది.ప్రతి అమ్మాయీ ఒత్తయిన  నల్లని శిరోజాల కోసం ఆరాట పడుతూ ఉంటుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అయినా సరే వెంట్రుకలు రాలిపోవడం ఆగదు. ఒత్తుగా ఉండే జుత్తు రాలిపోవడానికి  ఆరోగ్య పరంగానే  కాకుండా, ఇంకా ఇతర కారణాలు కూడా ఉంటాయి. మనకున్న  కొన్ని అలవాట్లు  కూడా జుత్తు రాలిపోవడానికి  కారణం అంటున్నారు  సౌందర్య  నిపుణులు. మరి శిరోజాల అందం  పాడు చేస్తున్న మన తప్పిదాలేంటో  తెలుసుకోండి!  

 మారుతున్న వాతావరణ పరిస్థితులు, కాలుష్యవల్ల తలలో చుండ్రు పెరిగిపోతూ ఉంటుంది. జుత్తు రాలడానికి చుండ్రు ఒక కారణం. ఈ సమస్య తగ్గుముఖం పడుతుందనే ఉద్దేశంతో తలస్నానం సమయంలో ఎక్కువసేపు జుత్తు రుద్దుకుంటాం. గాఢత ఎక్కువగా ఉండే షాంపూ ఉపయోగిస్తుంటాం. దానివల్ల కుదుళ్లు బలహీనపడి జుత్తు రాలిపోయే అవకాశంఉంది. ఎక్కువసేపు తల రుద్దకుండా చుండ్రు సమస్య నుంచి బయటపడే చిట్కాలు పాటించడం మంచిది. నిమ్మరసం గోరువెచ్చని నూనెలో వేసుకుని తలకు అప్లయి చేసుకోవడం, తక్కువ గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయడం లాంటి చిట్కాలు పాటిస్తుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది.

అలంకరణ  సమయంలో

శిరోజాల అలంకరణ కూడా కొన్నిసార్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటుంది. అదెలా? అనుకుంటున్నారా, కొందరు బిగుతుగా పోనీటెయిల్‌ లేకుంటే ముడి, కాకపోతే అప్పుడప్పుడూ కష్టమైన హెయిర్‌ స్టయిల్స్‌ వేసుకుంటారు. అందంగా ఉన్న వాటిని తీసుకుని మళ్లీ దువ్వుకునేటప్పుడు జుట్టు పాడయ్యే అవకాశంవుంది. దీనివల్ల శిరోజాలు సాగినట్లు తయారై తెగిపోతుంది. అంతేకాక కేశాలంకరణ చేసుకునే క్రమంలో కొన్ని హెయిర్‌ స్ర్పేలు ఉపయోగిస్తుంటారు. ఇవి కూడా కురుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి వీలైనంత వరకు రసాయన ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించి జుత్తును లూస్‌గా ఉంచడం, అలాగే వదిలేయడం జడవేసుకోవడం లాంటివి చేయాలి.

ఎప్పుడూ కురుల ధ్యాసేనా!
కొందమంది మాటిమాటికీ కురులు సరిచేసుకుంటారు. అదే అలవాటు. జడ ముందుకు వేసుకుని లాగుతూ ఉంటారు. అలాగే అస్తమానం వెంట్రుకలు మెలిపెట్టుకోవడం, తాకుతూవుండటం మరికొందరి అలవాటు. ఇలా చేయడం వల్ల చేతులకు అంటిన మురికి కురుల్లో చేరుతుంది. దీనివల్ల జుత్తు జిడ్డుగా తయారవుతుంది. దీనివల్ల మరింత దుమ్ము జుత్తుల్లో వచ్చి చేరుతుంది. ఈ కారణంగా జుత్తు నిర్వీర్యమవుతుంది. అందుకే కురులను తరచు చేతులతో తాకే అలవాటున్నవారు, ఆ అలవాటు మానుకునే ప్రయత్నం చేయండి.

తడిజుట్టుతో జాగ్రత్త

ఉదయం తలస్నానం తర్వాత ఆరక ముందే కాలేజీలకు, ఆఫీసులకు లేటవుతుందని చాలామంది దువ్వెనతో చిక్కుతీస్తుంటారు. ఇలా దువ్వేటప్పుడు కూడా చాలా గట్టిగా దువ్వుతుంటారు. ఫలితంగా జుట్టు చివర్లు వంకరతిరుగుతాయి. తెగిపోతుంది. అంతేకాక మరికొందరు ఆరినా ఆరకపోయినా సరే దువ్వి గట్టిగా జడవేసుకుంటారు. ఇది కూడా జుత్తు ఊడిపోవడానికి ఒక కారణమే.

ఇతరత్రా

తలస్నానం తర్వాత వెంట్రుకలు ఆరబెట్టేందుకు సమయం లేకపోతే వదులుగా ఉండేలా రబ్బరు లేదంటే ఫ్లక్కర్‌ పెటుకోవాలి. అలాగే చిక్కు తీసేటప్పుడు ఒకేసారి పై నుంచి కిందకి దువ్వే ప్రయత్నం చేయకుండా కొంచెం కొంచెం చిక్కు తీయాలి. అప్పుడు జుట్టు సాగి తెగకుండా ఉంటుంది. అలాగే జుట్టు త్వరగా ఆరాలనే ఉద్దేశంతో చాలామంది బ్లోయింగ్‌ చేస్తుంటారు. ఇదికూడా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే అప్పటివరుకు తడిగా ఉన్న జుట్టు ఒక్కసారిగా పొడిగా అవ్వడం వల్ల పాడయ్యే అవకాశాలున్నాయి. తలకు ఎక్కువ సేపు టవల్‌ చుట్టుకుని ఉండడం, అతిఎక్కువగా షాంపూ చేయడం కూడా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.