పదిహేనో ఏట నుంచే జుట్టు తెల్లబడితే..

నా వయసు ఇరవై ఆరు. పదిహేనో ఏట నుంచే జుట్టు తెల్లబడటం ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే గడ్డం కూడా తెల్లబడుతోంది. ఆహారంతో ఈ సమస్యను అధిగమించే మార్గం ఉందా?

- కిశోర్‌, బెంగళూరు 
చిన్నతనంలోనే జుట్టు నెరవడం అనేది ఎక్కువగా వంశపారంపర్యంగా వస్తుంది. కొన్ని సందర్భాల్లో థైరాయిడ్‌ సమస్య కూడా తెల్ల జుట్టుకు దారి తీస్తుంది. దీన్ని ఆహారం ద్వారా 
పూర్తిగా నివారించడం కుదరదు. కానీ జుట్టు తెల్లబడే వేగాన్ని నియంత్రించొచ్చు. ఆహారంలో ప్రోటీన్‌, విటమిన్‌- బి 12, జింక్‌, ఐరన్‌, కాపర్‌ వంటి పోషకాలు అధికంగా ఉండేలా చూసుకుంటే కొంత వరకు ఉపయోగకరం. మాంసాహారం, పాలు, గుడ్లతో పాటు, కంది, సెనగ, పెసర్లు వంటి పప్పుల్లో ఏదో ఒకటి భోజనంలో ఉండేలా చూడండి. బాదం, వాల్నట్‌, పిస్తా, వేరుశెనగ వంటివి క్రమంగా తీసుకుంటే మంచిది. మీ జీవన శైలి కూడా నియమబద్ధంగా ఉండాలి. శారీరక మానసిక ఒత్తిడులను తగ్గించుకుంటూ, రోజూ వ్యాయామం చేయండి. తగిన నిద్రవేళలు పాటించండి. ఎక్కువగా కాలుష్యం బారిన పడకుండా చూసుకోండి. ధూమపానానికి దూరంగా ఉండండి. వీటన్నిటి వల్ల మంచి ఫలితం సాధించవచ్చు.