‘తెల్ల’బోతున్న యువత.. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే...

జుట్టు రంగుమారుతుండడంపై ఆందోళన
తెల్లగా మారిపోతున్న కురులు
మరికొందరిలో బట్ట తల సమస్య
కాలుష్యం, ఒత్తిడి కారణం అంటున్న నిపుణులు
పోషకాహార లోపం మరో కారణం
వంద శాతం యువతే బాధితులు
సమతుల ఆహారమే పరిష్కారం అంటున్న నిపుణులు
చిన్నచిన్న జాగ్రత్తలతో సమస్యకు చెక్‌

25-08-2018:రింగుల్లా తిరిగే ఉంగరాల జుట్టు చూస్తే మతిపోతుంది... గాలికి అలలా ఎగురుతూ సొగసులు ఆరబోస్తున్న కురులను చూస్తే ఈర్ష్య కలుగుతుంది... గాలివానలైనా చెక్కుచెదరక ఆత్మవిశ్వాసానికి చుక్కానిలా ఉన్న చిక్కని జుట్టును చూస్తే భలేగుందే అనిపిస్తుంది. మనిషి అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో కురుల పాత్ర అనన్య సామాన్యం. అటువంటి జుట్టుకు సమస్య వచ్చిపడితే యువత తట్టుకోగలదా. కానీ ఈ తరం యువతను పట్టిపీడిస్తున్న సమస్య ఇదే. యువతలో అధిక శాతం బట్టతల, తెల్లజుట్టుతో ఇబ్బంది పడుతూ ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.

ముఖారవిందానికి కురుల అందం అదనపు ఆకర్షణ. స్త్రీపురుషుల అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో జుట్టుది ప్రధాన పాత్ర. ఎంతటి అందాన్నైనా బట్టతల, తెల్లజుట్టు దెబ్బతీస్తాయి. చిన్నవయసులోనే జుట్టు తెల్లబడినా, బట్టతల వెక్కిరిస్తున్నా నలుగురిలో తిరగాలంటే నామోషీగా భావిస్తోంది ఈ తరం యువత. కాలుష్యం, ఒత్తిడి, ఇతరత్రా సమస్యలతో ఇప్పుడీ రెండు సమస్యలు సర్వసాధారణం కావడంతో మనోవేదనతో కుంగిపోతున్న వారు ఎందరో అంటే అతిశయోక్తి కాదు. ఇటీవల కాలంలో చిన్నవయసులోనే బట్టతల, జుత్తు తెల్లబడిపోతుండడం చాలామంది కుర్రాళ్లను ఆందోళనకు గురిచేస్తోంది. సమస్య ఏమిటో అర్థంకాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మారిన జీవన విధానం, కాలుష్యం సమస్యే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. గడచిన పదేళ్లలో జుట్టు రాలే సమస్య 80 శాతం పెరిగినట్లు పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కింగ్‌జార్జి ఆస్పత్రిలోని డెర్మటాలజీ విభాగానికి వచ్చే ఓపీలో 10 నుంచి 20 శాతం మంది ఈ రెండు సమస్యలతోనే బాధపడు తున్నవారే. పైగా వందశాతం మంది యువతే కావడం విశేషం. ఈ నేపథ్యంలో బట్టతల, తెల్ల జుట్టుకు కారణాలు, పరిష్కారాలపై నిపుణులతో మాట్లాడి ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.
 
కారణాలు అనేకం
తల స్నానానికి ఏ షాంపూ దొరికితే దాన్నే వినియోగించడం నష్టదాయకం. షాంపూల్లో ఉండే సోడియం హైడ్రాక్సీ వెంట్రుకలను తెల్లగా చేయడంతో పాటు జుట్టును పొడిబార్చి రాలిపోయేలా చేస్తుంది.
అతి చల్లని నీటితో తల స్నానం చేయకూడదు. వాయు, నీటి కాలుష్యాలు సమస్యకు కారణం.
హార్మోన్ల అసమతౌల్యం వల్ల జుట్టు రాలడం, తెల్లబడే అవకాశం ఉంది.
జంక్‌ఫుడ్‌ తీసుకోవడం చాలా సమస్య. ఇందులో వినియోగించే కొన్ని రసాయనాలు జుట్టుపై ప్రభావం చూపుతాయి.
సమయానికి భోజనం, నిద్ర లేకపోవడం, ఒత్తిడితో కూడిన ఉద్యోగం వల్ల జుట్టు రాలుతుంది.
శరీరానికి అవసరమైన విటమిన్స్‌ లోపమున్నా ఈ రెండు సమస్యలు కనిపిస్తాయి. ప్రధానంగా వెంట్రుకలు బలం గా ఉండేలా చేసే మెగ్నీషియం, కాల్షియం, ఐరన్‌ లోపం వల్లే ఎక్కువ మంది ఈ సమస్య బారిన పడుతున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

శరీరానికి పోషక పదార్థాలతో కూడిన సమతుల ఆహారం అందించడం ద్వారా చాలా వరకు సమస్య నుంచి బయటపడవచ్చును. తిండి, నిద్ర సక్రమంగా ఉండాలి.
ముఖ్యంగా ఆకుకూరలు, మినరల్స్‌, విటమిన్స్‌ అధి కంగా ఉన్న ఆహారం తీసుకోవలి. ప్రతిరోజూ కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం ఉండే ఆహారం తీసుకుంటే మంచిది.
వారంలో కనీసం రెండుసార్లు తలకు ఆయిల్‌ పట్టించాలి. కొబ్బరి నూనె రాస్తే మంచిది. కొన్ని రకాల ఆయిల్స్‌లోని కెమికల్స్‌ జుట్టును బలహీన పరుస్తాయి. వాటి జోలికి వెళ్లకూడదు.
గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. స్నానం అనంతరం జుట్టును తుడిచేటప్పుడు సున్నితంగా తుడవాలి.
షాంపూ కంటే సంప్రదాయ కుంకుడు రసం, షీకాయి వినియోగించడం మంచిది.

వైద్యం ఉంది

తెల్ల జుట్టు, జుట్టు రాలే సమస్యలకు వైద్యం ఉంది. ఈ సమస్య ఉన్నవారు చర్మవ్యాధుల వైద్యులను సంప్రదించాలి. ఆస్పత్రికి వచ్చే రోగికి హార్మోన్లు సక్రమంగా పనిచేస్తున్నదీ లేనిదీ వైద్యులు పరీక్షిస్తారు. హార్మోన్‌ సమతౌల్యం లేకుంటే హార్మోన్‌ థెరపీ చేస్తారు. అసమతౌల్యంగా ఉన్న హార్మోన్స్‌ను ఈ థెరపీ ద్వారా సాధారణ స్థితికి తెస్తారు. ప్లేట్‌లెట్‌ రిచ్‌ప్లాస్మా థెరఫీతో జుట్టు రాలడాన్ని నియంత్రిస్తారు. జుట్టురాలిన చోట ఇంజక్షన్‌ చేసి జుట్టు పెరిగేలా చేస్తారు. ఈ రెండు పద్ధతుల్లో సమస్య పరిష్కారం కాకుంటే హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ థెరపీకి పంపిస్తారు. జుట్టు తెల్లబడడానికి కారణాలు గుర్తించి అవసరమైన జింక్‌, ఐరన్‌, బయోటిన్‌, కాల్షియం, విటమిన్‌ బి1, బి6, బి12 వంటి టాబ్లెట్లను అందించి తెల్లగా మారిన జుట్టును నల్లబరుస్తారు.
 
కారణాలు బోలెడు
చిన్నవయసులోనే తెల్లజుట్టు రావడానికి అనేక కారణాలుంటాయి. వాతావరణ కాలుష్యం పెరిగిపోవడం, రసాయనాలతో కూడిన షాంపూలతో జుట్టును శుభ్రం (తలస్నానం) చేయడం, మానసిక ఒత్తిడి, విటమిన్ల లోపం కారణం కావచ్చు. రాత్రిపూట విధులు నిర్వహించేవారికి, చిన్నవయసులోనే ఊబకాయులుగా ఉన్నవారికి శరీరంలో మెటబాలిజం తగ్గిపోయి తెల్లజుట్టు రావడానికి అవకాశం ఉంది. మానసిక రోగాలకు వాడే మందులు, రకరకాల హెయిర్‌ ఆయిల్స్‌, డైలు వాడుతుండటం కూడా కారణమే. హెల్మెట్లు వాడటం వల్ల జుట్టుకు చెమట పడుతుంది. జన్యుపరమైన లోపాలతో వంశపారంపర్యంగానూ తెల్లజుట్టు రావచ్చు. ఇలా మూడు నుంచి నాలుగు శాతం మందిలో ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా వస్తుంది. శరీరానికి తగిన వ్యాయామం లేకపోతే దాని ప్రభావం మనకు తెలియకుండానే జుట్టు పెరుగుదలపై పడుతుంది. యువత జుట్టుకు నూనె రాయకపోవడం కూడా తెల్లజుట్టు రావడానికి కారణమే. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడంతోపాటు సమతుల ఆహారం తీసుకోవడం, రసాయన అవశేషాలు లేని కుంకుడు, మందార ఆకులు వంటి వాటితో తలస్నానం చేయడం మంచిది.

డాక్టర్‌ పి.వి.ఎస్‌.విజయభాస్కర్‌, చైర్మన్‌

రూట్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌