జుట్టు రాలకుండా కాపాడుకోవడానికి మార్గాలు

6-7-2017: జుట్టు ఊడుతుంటే చిన్నవాళ్ల దగ్గరి నుంచి పెద్దవాళ్ల దాకా ఆందోళన పడుతుంటారు. జుట్టు ఊడితే ఇంకేముంది అందం కాస్తా తరిగిపోతుందని ఆవేదన చెందుతుంటారు. జుట్టు ఊడడానికి చాలా కారణాలే ఉన్నాయి. అలాగే వెంట్రుకలు ఊడిపోకుండా కాపాడుకోవడానికి కూడా మార్గాలున్నాయి.

 
జుట్టు రాలిపోవడానికి కారణాలు
పోషకాహారలోపం, హార్మోన్ల అసమతౌల్యత, థైరాయిడ్‌, పిసివొఎస్‌ కొన్ని ముఖ్య కారణాలు. ఇవే కాదు కడుపుతో ఉన్నప్పుడు, పిల్లలు పుట్టకుండా వాడే పిల్స్‌ వల్ల, విపరీతమైన ఒత్తిడి కారణంగా, అలాగే విషపూరితమైన రసాయనాలున్న హెయిర్‌ ప్రాడెక్టులు వాడడం వల్ల కూడా వెంట్రుకలు బాగా రాలిపోతాయి. అంతేకాదు సన్నగా కనిపించాలని క్రాష్‌ డైట్లు చేయడం, విపరీతంగా లావు తగ్గడం, జడను బిగదీసి వేసుకోవడం, వయసు పెరగడం వంటి వాటి వల్ల కూడా జుట్టు ఊడుతుంది. సి విటమిన్‌ లోపం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి.
 
వెంట్రుకలు పెరగాలంటే
కొబ్బరి లేదా బాదం నూనె వేడిచేసి మాడుకు రాసుకుని వేళ్లతో మెల్లగా మర్దనా చేయాలి.
బీట్‌రూట్‌ జ్యూసు, గ్రీన్‌ టీ, ఉసిరి, వేపాకులు, సహజసిద్ధమైన హెయిర్‌ మాస్కుల వల్ల కూడా జుట్టు పెరుగుతుంది.
ఒక టేబుల్‌ స్పూను ఉసిరి గుజ్జు, నిమ్మరసంలను బాగా కలిపి దాంతో తలను మర్దనా చేసుకుని రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. మర్నాడు షాంపుతో తలస్నానం చేయాలి.
మెంతుల్లో హార్మోన్లను సమతౌల్యం చేసే గుణాలు ఉన్నాయి. వీటి వల్ల జుట్టు పెరగడమే కాదు కుదుళ్లు పటిష్టంగా ఉంటాయి. మెంతుల్లో నికొటనిక్‌ యాసిడ్‌, ప్రొటీన్లు బాగా ఉంటాయి. ఇవి శిరోజాల పెరుగుదలకు సహకరిస్తాయి. అందుకే ఒక కప్పు మెంతుల్ని రాత్రి నీళ్లల్లో నానపెట్టి ఉదయం గ్రైండర్‌ లో వేసి పేస్టులా చేయాలి. ఆ పేస్టును తలకు రాసుకుని నలభై నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. నెలపాటు ఇలా చేస్తే మంచి ఫలితాలు కనపడతాయి.
ఉల్లిరసం వల్ల కూడా జుట్టు ఊడడం తగ్గుతుంది. ఉల్లిలో సల్ఫర్‌ బాగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లకు రక్తం బాగా సరఫరా అయ్యేట్టు చేస్తుంది. ఉల్లిరసంలోని యాంటిబాక్టీరియల్‌ గుణాలు తలలోని బాక్టీరియా, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అందుకే ఉల్లిపాయను గ్రైండ్‌ చేసి ఆ గుజ్జు నుంచి రసం తీయాలి. ఆ రసాన్ని తలకు రాసుకుని అరగంటపాటు అలానే ఉంచుకోవాలి. ఆ తర్వాత నీటితో వెంట్రుకలను బాగా కడుక్కుని షాంపుతో తల రుద్దుకోవాలి. ఇంకో మార్గం కూడా ఉంది. మూడు టేబుల్‌స్పూన్ల ఉల్లిరసం, రెండు టేబుల్‌ స్పూన్ల కలబంద రసం, ఒక టేబుల్‌స్పూన్‌ ఆలివ్‌ ఆయుల్‌ మూడింటిని కలిపి వెంట్రుకలకు పట్టించుకొని అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేస్తే జుట్టు రాలదు.
కలబంద జెల్‌ను తలకు పట్టించుకుని కొన్ని గంటలపాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీళ్లతో స్నానం చేయాలి. ఇలా వారంలో నాలుగుసార్లు చేయాలి. ఇందులోని ఎంజైములు జుట్టు పెరగడానికి తోడ్పడతాయి.