పేను కొరుకుడును ఆపే నల్లజీడి

11-09-2017: 2 లీటర్ల కొబ్బరి నూనెలో గానీ, నువ్వుల నూనెలో గానీ 3 నల్లజీడి గింజల్ని కత్తిరించి వేసి, కొద్దిసేపు కాచి ఆ ముక్కలను తీసివేయాలి. ఆ తైలాన్ని రోజూ తలకు రాస్తే, తెల్లబడ్డ వెంట్రుకలు నలుపెక్కడమే కాకుండా వాటి కుదుర్లు గట్టిపడి వెంట్రుకలు రాలిపోకుండా ఉంటాయి.
2 కిలోల ఆవు నెయ్యిలో 8 జీడి గింజల ముక్కలు వేసి, కాచి ఆ ముక్కల్ని తీసివేయాలి. ఆ నెయ్యిని రెండు స్పూన్‌ల మోతాదులో రోజూ సేవిస్తే, క్రిమి రోగాలు, సుఖ వ్యాధులు వాత దోషాలు తగ్గుతాయి. కాకపోతే వేడి శరీరం వాళ్లు ఈ జీడిని వాడకూడదు.
నల్ల జీడి కాండపు బెరడును నీడన ఎండించి, మెత్తటి చూర్ణం తయారు చేసుకోవాలి. 25 గ్రాముల ఈ చూర్ణాన్ని 100 మి. లీ కొబ్బరి నూనెలో కలిపి ఆ నూనెను లేపనంగా వేస్తే కాలిన గాయాలు మానిపోతాయి.
జీడి గింజల్లోని జీడిని తీసి, చూర్ణం చేసి, తేనెతో కలిపి రాస్తే, పేను కొరుకుడు తగ్గిపోయి, మళ్లీ వెంట్రుకలు మొలుస్తాయి.
జీడి చెక్కను మెత్తగా దంచి ఉడికించి, పైన కట్టుకడితే, వాపుతో కూడిన కీళ్లనొప్పులు తగ్గిపోతాయి.