బట్టతలపై జుట్టు మొలిపించే సూది మందు

భారతీయ వైద్యుల ఔషధానికి అమెరికా పేటెంట్‌

‘ఆంధ్రజ్యోతి’కి డాక్టర్‌ దేవ్‌రాజ్‌ సోమ్‌ ఇంటర్వ్యూ


12-08-2017: ‘‘ఇసుకను పిండి నూనె తీయొచ్చు.. ఎండమావిలో నీళ్లు తాగొచ్చేమోగానీ.. బట్టతల మీద జుట్టు మొలిపించడం మాత్రం కష్టమబ్బా’’ ..చాలా మంది బట్టతల బాధితుల మనసులో మాట ఇది! ఏదో వీవింగ్‌తోనో.. హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తోనో సరిపెట్టుకోవాల్సిందేగానీ దీనికి సరైన మందు లేదని వారు తెగ బాధపడిపోతుంటారు. అలాంటి వారికి ఒక శుభవార్త. అపోలో స్పెకా్ట్ర ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ దేవ్‌రాజ్‌ సోమ్‌, డాక్టర్‌ రింకీకపూర్‌ పరిశోధనల ఫలితంగా ఆ కొరత కూడా తీరిపోయింది. వారు తయారుచేసిన క్యూఆర్‌ 678 అనే మందు (ఇంజెక్షన్‌)కు అమెరికా పేటెంట్‌ లభించింది. ఈ తరహా మందుకు పేటెంట్‌ లభించడం ప్రపంచంలో ఇదే తొలిసారి. దీనిపై డాక్టర్‌ దేవ్‌రాజ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు..

 
క్యూఆర్‌ 678.. బట్టతల బాధితుల ఆశాదీపం.. ఈ మందును తయారుచేయటానికి మీకు ఎంతకాలం పట్టింది?
ఈ మందును 2008లో తయారుచేశాం. 2010లో క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించాం. 2013లో యునైటెడ్‌ స్టేట్స్‌ పేటెంట్‌ అండ్‌ ట్రేడ్‌మార్క్‌ ఆఫీసులో పేటెంట్‌ కోసం దరఖాస్తు చేశాం. అంటే ఈ మందును బయటకు తీసుకురావడానికి దాదాపు పదేళ్లపాటు శ్రమించాల్సివచ్చింది. క్యూఆర్‌ 678 అనే ఈ ఇంజెక్షన్‌ను మన దేశంలో ప్రవేశపెట్టడం కోసం డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి అడిగాం. ఇది రావడానికి మరో తొమ్మిది నెలలు పట్టవచ్చు. అప్పుడు ఈ మందు దేశమంతా దొరుకుతుంది. ఇప్పుడు మాత్రం ముంబైలోని అపోలో ఆస్పత్రి స్టడీ క్లినిక్‌లో లభిస్తుంది.
 
దీనిని ఎలా ప్రయోగిస్తారు?
మన జుట్టు కింద సూక్ష్మమైన రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాలలో సమస్య ఏర్పడితే జుట్టు ఊడిపోతుంది. ఈ సమస్యకు జన్యుపరమైన పరిస్థితులు (అంటే పూర్వీకులకు ఉంటే మనకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ), వాతావరణ పరిస్థితులు, జీవన శైలి, హార్మోన్ల సమతౌల్యం లోపించడం ఇలా రకరకాల కారణాలుంటాయి. క్యూఆర్‌ 678ను మీసోథెరపి అనే టెక్నిక్‌ ద్వారా కుదుళ్లలోకి ఎక్కిస్తాం. అది కుదుళ్లపై పనిచేసి మళ్లీ జుట్టు మొలిచేలా చేస్తుంది. ఈ చికిత్స కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది.
 
బట్టతల వారందరికీ జుట్టు వస్తుందా? పరిమితులున్నాయా?
బట్టతల వచ్చి ఎంత కాలమయిందనే విషయంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తికి బట్టతల వచ్చిందనుకుందాం. రాగానే ఈ ఇంజెక్షన్‌ చేయించుకుంటే పూర్వం ఎలా ఉందో అదేరీతిలో జట్టు వస్తుంది. బట్టతల వచ్చి 15ఏళ్లు అయిపోయిన వ్యక్తికి అంత జుట్టు రాకపోవచ్చు. స్త్రీ, పురుషులందరిపైనా ఒకేలా పనిచేస్తుంది.ఎలాంటి దుష్పరిణామాలూ ఉండవు.
 
ఎన్ని ఇంజెక్షన్లు తీసుకోవాలి? ఎంత ఖర్చు అవుతుంది?
ఈ ఇంజెక్షన్‌ ఖరీదు రూ.6 వేలు. జుట్టు పూర్తిగా మొలవడానికి ఎనిమిది నుంచి పది ఇంజెక్షన్లు తీసుకోవాలి. దాదాపు రూ.60 వేలు ఖర్చవుతుంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మందులు, హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్ల ఖర్చు కన్నా తక్కువ. అంతే కాకుండా చాలా కచ్చితమైన ఫలితాలు వస్తాయి.
 
అలా వచ్చిన జట్టు ఎంత కాలం ఉంటుంది?
ఈ చికిత్సతో ఒకసారి వెంట్రుక వచ్చిన తర్వాత అది పెరుగుతూ ఉంటుంది. ఏవైనా తీవ్రమైన కారణాలుంటేనే అది ఊడిపోతుంది. మేము చేసిన క్లినికల్‌ ట్రయల్స్‌లో అలాంటి సమస్యలేమీ ఏర్పడలేదు. ఒకవేళ ఊడినా మళ్లీ ఇంజెక్షన్‌ చేయించుకుంటే తిరిగి మొలుస్తుంది.