జట్టు పొడిబారుతోందా?

14-11-2018: చలికాలంలో చర్మ సంరక్షణతో పాటు కేశ సంరక్షణ కూడా ఎంతో ముఖ్యం. ఈ సీజన్‌లో జుట్టు పొడిబారడం, చుండ్రు సమస్య వంటివి వేధిస్తాయి. కేశాలు కొత్త జీవంతో, మంచి కండిషన్‌లో ఉండాలంటే...
 
మసాజ్‌: వారంలో ఒకసారి వేడి కొబ్బరినూనె లేదా బాదం నూనెతో తలకు మసాజ్‌ చేసుకోవాలి. దీంతో తల భాగంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. వెంట్రుకలకు అవసరమైన పోషకాలూ అందుతాయి. జుట్టు పొడిబారడం తగ్గి, చుండ్రు సమస్య పోతుంది.
ట్రిమ్మింగ్‌: చలికాలంలో వెంట్రుకలను ఎప్పటికప్పుడు ట్రిమ్‌ చేసుకోవాలి. జుట్టు తడిగా ఉండడం వల్ల వెంట్రుకలు దృఢత్వం కోల్పోయి, కొసలు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే క్రమం తప్పకుండా ట్రిమ్మింగ్‌ చేసుకోవడం మంచిది.
కండిషనర్‌: షాంపూ చేసుకున్న తర్వాత జుట్టును కండిషనింగ్‌ చేయడం తప్పనిసరి. చలికాలంలో డీప్‌ కండిషనింగ్‌ చేయడం వల్ల వెంట్రుకలు పొడిబారవు.
వాషింగ్‌: చలికాలంలో రోజూ తల స్నానం చేయడం వల్ల వెంట్రుకలకు పోషణనిచ్చే సహజ నూనెలు తొలగిపోయి, జుట్టు బలహీనంగా, జీవం కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. వారంలో రెండుసార్లు జుట్టును వాష్‌ చేయడం మంచిది.
కొప్పు: చల్లగాలి నుంచి రక్షణ పొందేందుకు కేశాలను వివిధ స్టయిల్స్‌లో కొప్పు వేయండి. బన్‌, విగ్‌, వేవ్స్‌, హెడ్‌ స్కార్వ్‌తో సరికొత్త లుక్‌లో మెరిసిపోండి. కండిషనర్‌ వాడిన తర్వాతే సిగ వేసుకోండి.