తలకు మించిన సమస్య

ఆంధ్రజ్యోతి, 13-06-2017:జుట్టు గురించిన చర్చ వస్తే అందరూ తలా ఒక సమస్యను ఏకరువు పెడతారు. రాలిపోతుందని, బిరుసెక్కుతోందని, చిట్లుతోందని....ఇలా ‘తల’కో సమస్య. అయితే ఇన్ని సమస్యలున్నా వాటిని తీవ్రంగా పరిగణించరు. ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటారే తప్ప ఆ సమస్యలకు వైద్య పరిష్కారాలుంటాయనే ఆలోచనే చేయరు. అవును. వెంట్రుకలకు సంబంధించిన ప్రతి సమస్యకూ పరిష్కారముంటుంది. ఆ సమస్యల మీద అవగాహన, కొంత అప్రమత్తత ఏర్పరుచుకుంటే వెంట్రుకల సమస్యలను తేలికగానే సరిచేయొచ్చు అంటున్నారు వైద్యులు.

మన తల మీద జుట్టు ఎలా ఉండాలన్నది ఎప్పుడు నిర్ణయమవుతుందో తెలుసా? మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడే! 22 వారాల గర్భస్థ దశలో ఉన్నప్పుడు ఎన్ని వెంట్రుకల కుదుళ్లు ఏర్పడతాయో అవే మన జీవితాంతం ఉండిపోతాయి. ఆ దశలో తల మీద కనీసం 10 లక్షల వెంట్రుకల కుదుళ్లు ఏర్పడతాయి. పెరిగి పెద్దయ్యే దశలో కొత్త కుదుళ్లు ఏర్పడటమనేది జరగదు. సాధారణంగా వెంట్రుకలు రోజుకి 0.3 నుంచి 0.4 మిల్లీమీటర్లు / సంవత్సరానికి దాదాపు 6 అంగుళాల పొడవు పెరుగుతాయి. అయితే ఈ పెరుగుదల ‘అనాజన్‌, కెటాజన్‌, టిలోజన్‌’ అనే మూడు దశల్లో జరుగుతుంది. కుదుళ్ల నుంచి మొలకెత్తిన ప్రతి వెంట్రుక 2 నుంచి 5 ఏళ్ల వరకూ పెరిగి ఆ తర్వాత రాలిపోతుంది. తర్వాత ఆ వెంట్రుకల కుదుళ్లు కొంతకాలంపాటు విశ్రాంతి దశలో ఉంటాయి. ఆ సమయంలో మనకు జుట్టు పలచబడినట్టు కనిపిస్తుంది. దాంతో రాలిన వెంట్రుకల గురించే చింతిస్తూ ఉంటాం. కానీ నిజానికి విశ్రాంతి దశలో ఉన్న కుదుళ్ల నుంచి తిరిగి కొత్త వెంట్రుకలు మొలకెత్తుతాయి. ఇది అందరికీ జరిగేదే! ఇలా సాధారణంగా రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలటం సహజం. ఇంతకంటే ఎక్కువ రాలుతున్నప్పుడు మాత్రం సమస్యగా భావించాల్సిందే!

వెంట్రుకలు రాలటానికి ప్రధాన కారణాలు
వెంట్రుకల సమస్యలకు కారణం మన శరీరంలోనే ఉంటుంది. ఆహారం, ఆరోగ్యం, అస్వస్థతలు, తీసుకునే మందుల ప్రభావం వల్ల వెంట్రుకలు రాలిపోయే అవకాశం ఉంటుంది.
పౌష్టికాహార లోపం: మనం తీసుకునే ఆహారంలోని ఎక్కువ శాతం పోషకాలు శరీరావసరాలకే ఖర్చయిపోతాయి. అలా పోగా మిగిలిన పోషకాలే వెంట్రుకలకు అందుతాయి. కాబట్టి మాంసకృతులు పుష్కలంగా ఆహారం తీసుకోవాలి. అప్పుడే కుదుళ్లు బలంగా ఉంటాయి. మాంసకృతులు లోపిస్తే కుదుళ్లు బలహీనపడి, జుట్టు రాలటంతోపాటు కొత్తగా మొలకెత్తే వెంట్రుకలు కూడా త్వరగా ఊడిపోతాయి.
ఎనీమియా: జుట్టు రాలటానికి ప్రధాన కారణం... రక్త హీనత (ఎనీమియా) ఆకుకూరలు, మాంసం, గుడ్లు, చేపలు వంటి ఆహారం తీసుకోకపోవటం వల్ల రక్తహీనత ఏర్పడి వెంట్రుకలు నిర్జీవంగా తయారై రాలిపోతాయి.
హార్మోన్లలో అవకతవకలు: స్త్రీలలో మేల్‌ హార్మోన్‌ ఎక్కువవటం, థైరాయిడ్‌ హార్మోన్‌లో హెచ్చుతగ్గుల వల్ల కూడా వెంట్రుకలు పలచబడతాయి. గర్భిణిగా ఉన్నప్పుడు తలెత్తే హార్మోన్‌ హెచ్చుతగ్గుల వల్ల వెంట్రుకలు రాలి ప్రసవమైన తర్వాత తిరిగి పెరుగుతాయి.
మందుల ప్రభావం: మధుమేహం, డిప్రెషన్‌, ఫిట్స్‌ మొదలైన మందుల దుష్ప్రభావం వల్ల కూడా జుట్టు రాలుతుంది. క్యాన్సర్‌ చికిత్సలో ఇచ్చే కీమోథెరపీ, రేడియేషన్‌ వల్ల కూడా వెంట్రుకలు ఊడిపోతాయి.
నీటి కాలుష్యం: కొన్ని ప్రాంతాల్లోని నేలల్లో క్యాడ్మియం, సీసం మొదలైన కలుషితాలు ఉంటాయి. ఇవి కలిసిన నీరు తాగితే ఆ ప్రభావం వెంట్రుకల మీద పడుతుంది.
ట్రాక్షనల్‌ అలోపేసియా: వెంట్రుకలను బలంగా వెనక్కి లాగి కట్టే హెయిర్‌ స్టయిల్‌ వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి. వెంట్రుకలను వెనక్కి లాగటం వల్ల నుదుటి దగ్గరున్న వెంట్రుకల మీద ఒత్తిడి పెరిగి జుట్టు రాలిపోతుంది. ఈ సమస్యనే ట్రాక్షనల్‌ అలోపేసియా అంటారు.
చుండ్రు: జుట్టు రాలటానికి మరో ప్రధాన కారణం చుండ్రు. దీన్ని మెడికేటెడ్‌ షాంపూలతో వదిలించుకోకుంటే వెంట్రుకలు రాలుతూనే ఉంటాయి.
జుట్టు తత్వం కనిపెట్టాలి: చర్మంలాగే జుట్టులోనూ తత్వాలుంటాయి. జిడ్డు, సాధారణ, పొడి రకాలకు చెందిన వెంట్రుకలను వాటి తత్వాన్ని బట్టి షాంపూ, కండిషనర్లను ఎంచుకోవాలి.

చుండ్రు ఎందుకు?
తల మీదుండే మృతకణాలే చుండ్రు. కొందరికి ఇది తీవ్రంగా ఉంటుంది. రోజు విడిచి రోజు తలస్నానం చేస్తూ వెంట్రుకలను శుభ్రంగా ఉంచుకోగలిగితే చుండ్రు సమస్య ఉండదు. చుండ్రును అశ్రద్ధ చేస్తే అది వెంట్రుకల కుదుళ్లను ఫాలిక్యులైటిస్‌ అనే ఇన్‌ఫెక్షన్‌కు గురి చేస్తుంది. దాంతో తలలో పుండ్లు ఏర్పడతాయి. వెంట్రుకలు కూడా విపరీతంగా రాలిపోతాయి. కాబట్టి చుండ్రు అదుపులోకి రాకపోతే వైద్యుల్ని కలిసి చికిత్స తీసుకోవాలి.

వెంట్రుకలు చిట్లడం
వెంట్రుకలు చిట్లడానికి ముఖ్య కారణం పోషకాహార లోపం. దీంతోపాటు వెంట్రుకల సౌందర్యం కోసం చేసే స్ట్రయిటెనింగ్‌, పర్మింగ్‌, డ్రయింగ్‌ చేసినా వెంట్రుకలు చిట్లుతాయి. ఈ పరికరాలు ఉత్పత్తి చేసే వేడి వల్ల వెంట్రుకల చివర్లు చిట్లుతాయి. కాబట్టి ఎంతో అరుదుగా తప్ప ఈ పరికరాలను వాడకూడదు. అలాగే వెడల్పాటి పళ్లున్న దువ్వెననే వాడాలి. ఇరుకైన దువ్వెనతో పదే పదే దువ్వటం వల్ల కూడా వెంట్రుకలు చిట్లుతాయి. చిట్లిన వెంట్రుకల చివర్లను తరచూ ట్రిమ్‌ చేస్తుంటే సమస్య సర్దుకుంటుంది.

పేను కొరుకుడు
పేను కొరుకుడు పేల వల్ల రాదు. ఇది ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌. తల మీద కొంత ప్రదేశంలో ప్యాచ్‌లా వెంట్రుకలు ఊడిపోతూ ఉంటే పేను కొరుకుడుగా భావించాలి. ఈ సమస్య కనిపించిన వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తే సమర్థమైన చికిత్స అందించి ఊడిన వెంట్రుకల స్థానంలో తిరిగి మొలిచేలా చేస్తారు.

బట్టతల
ఇది వంశపారంపర్యం. కొందరికి నుదురు నుంచి, మరికొందరికి నడి నెత్తి నుంచి వెంట్రుకలు ఊడటం మొదలవుతుంది. తల్లి, తండ్రి.. ఇద్దరి వైపు బంధువుల నుంచి వంశపారంపర్యంగా బట్టతల పురుషులకు సంక్రమిస్తుంది. మేనమామ, బాబాయి, తాతల నుంచి బట్టతల వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. ఇక స్త్రీల విషయంలో కూడా జుట్టు పలచబడటమనే సమస్య వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. స్త్రీలలో నుదుటి దగ్గరున్న వెంట్రుకలు ఊడటం మొదలుపెడతాయి.

బాల నెరుపు
జన్యువుల్లో వచ్చే మార్పులు, జీవనశైలుల మూలంగా వెంట్రుకల్లో ఉండే మెలనిన్‌ తగ్గిపోవటం వల్ల వెంట్రుకలు చిన్న వయసులోనే తెల్లబడిపోయే సమస్య ఈమధ్య కాలంలో ఎక్కువైంది. పౌష్టికాహార లోపం వల్ల కూడా యుక్త వయసులోనే వెంట్రుకలు తెల్లబడిపోతాయి. కాబట్టి సమతులాహారం తీసుకోవాలి.

వెంట్రుకల తత్వం అర్థం చేసుకోవాలి
చర్మంలాగే వెంట్రుకల తత్వాల్లో నార్మల్‌, ఆయిలీ, డ్రై.. అనే మూడు రకాలుంటాయి. నార్మల్‌ జుట్టు చిక్కులు ఎక్కువ లేకుండా దువ్వటానికి తేలికగా ఉంటుంది. డ్రై హెయిర్‌ పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. ఇక జిడ్డు జుట్టు అంటుకుపోయి నూనె రాసినట్టు కనిపిస్తుంది. నార్మల్‌ హెయిర్‌కి సమస్యలు తక్కువ. కానీ డ్రై, ఆయిలీ హెయిర్‌కు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. పొడిబారిన వెంట్రుకలకు తల స్నానానికి ముందు గోరు వెచ్చని నూనె పట్టించి మసాజ్‌ చేసి ఆ తర్వాతే తల స్నానం చేయటం అలవాటు చేసుకోవాలి. జిడ్డు వెంట్రుకలున్నవాళ్లు సీకాయ, కుంకుడుకాయలతో తలస్నానం చేస్తే అదనపు జిడ్డు వదిలిపోతుంది. వీళ్లు కండిషనర్‌ వాడకూడదు. రోజూ తలస్నానం తప్పనిసరి. ఇక పొడి జుట్టు ఉన్నవాళ్లు మైల్డ్‌ షాంపూలే వాడాలి.

ఏ షాంపూ ఎంచుకోవాలి?
తలను శుభ్రం చేసుకోవటానికి ఎలాంటి షాంపూ అయినా ఉపయోగించవచ్చు. అయితే చుండ్రు, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవాళ్లు వైద్యులు సూచించిన షాంపూలే వాడాలి. షాంపూతో తలస్నానం చేసినప్పుడు వెంట్రుకల కుదుళ్లు తెరుచుకుంటాయి. దాంతో వెంట్రుకలు వదులుగా తయారవుతాయి. కాబట్టి తలస్నానం ముగించిన వెంటనే కండిషనర్‌ అప్లై చేయాలి. దీని వల్ల తెరచుకున్న పోర్స్‌ మూసుకుపోయి వెంట్రుకలు ఊడిపోకుండా ఉంటాయి. అలాగే జుట్టు తత్వాన్ని బట్టి అందుకు తగిన షాంపూనే ఎంచుకోవాలి. డ్రై హెయిర్‌ ఉన్నవాళ్లు కండిషనర్‌ కలిసిన షాంపూ, జిడ్డు వెంట్రుకలు ఉన్నవాళ్లు ఆయిల్‌ ఫ్రీ షాంపూ వాడాలి. తల స్నానానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ సబ్బు వాడకూడదు.


హెయిర్‌ డై వాడొచ్చా?
తల రంగులు వాడొచ్చు. అయితే అది ఎలాంటి రంగైనా అమ్మోనియా కలవనిదై ఉండాలి. పొడులు కాకుండా క్రీమ్‌ బేస్‌డ్‌ హెయిర్‌ డై వాడటం మేలు. హెయిర్‌ డై వేసుకున్న ప్రతిసారీ షాంపూతో శుభ్రం చేసుకుని, తర్వాత కండిషనర్‌ తప్పనిసరిగా అప్లై చేయాలి.

హెయిర్‌ టిప్స్‌
వెంట్రుకలు ఎలాంటి సమస్యలూ లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
న్యూట్రిషన్‌: పోషకాహారం తీసుకోవాలి. ఆహారంలో తగినన్ని మాంసకృతులు ఉండేలా చూసుకోవాలి.
హైడ్రేషన్‌: తేమ తగ్గితే చర్మం పొడిబారినట్టే వెంట్రుకలూ పొడిబారతాయి. కాబట్టి రోజుకి 8 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి.
నిద్ర: పగటివేళ వెంట్రుకలకు కలిగిన నష్టమంతా రాత్రివేళ నిద్రతో భర్తీ అవుతుంది. కాబట్టి రోజుకి కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి.
పొల్యూషన్‌: కలుషిత నీరు, గాలి నుంచి వెంట్రుకలను కాపాడుకోవాలి. ఇందుకోసం మంచినీటితో తలస్నానం చేయాలి. బయటకెళ్లేటప్పుడు జుట్టును స్కార్ఫ్‌తో కప్పుకోవాలి.
వ్యాధులు: వెంట్రుకల మీద ప్రభావం చూపించే వ్యాధులకు వాడే మందుల గురించి వైద్యులతో చర్చించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
వెడల్పాటి పళ్లున్న దువ్వెన: దగ్గరగా పళ్లున్న దువ్వెన వాడకూడదు. చిక్కులు పడితే అలాంటి దువ్వెనతో బలంగా లాగకూడదు. అలా చేస్తే వెంట్రుకలు తెగిపోతాయి. చిక్కు తీయటానికి, దువ్వటానికి వెడల్పాటి పళ్లున్న దువ్వెననే వాడాలి.

తడి జుట్టును ఫ్యాన్‌ గాలికి లేదా హెయిర్‌ డ్రయర్‌తో ఆరబెట్టకుండా సహజసిద్ధంగా ఆరనివ్వాలి. తడిగా ఉన్నప్పుడు దువ్వితే వెంట్రుకలు ఊడిపోతాయి. కాబట్టి జుట్టు పూర్తిగా ఆరాకే దువ్వుకోవాలి.
    వెంట్రుకలను బిగించి కట్టడం మానుకోవాలి. బిగుతైన రబ్బర్‌ బ్యాండ్లు, హెయిర్‌ స్టయిల్స్‌ వల్ల వెంట్రుకలు చిట్లుతాయి.
    చుండ్రు ఉన్నవాళ్లు మెడికేటెడ్‌ షాంపూలు వాడటంతోపాటు దిండ్లు, దుప్పట్లు, టవళ్లు శుభ్రంగా ఉంచుకోవాలి.
    అతి చల్లని, అతి వేడి నీటితో తలస్నానం చేయకూడదు. ఇందుకోసం గోరు వెచ్చని నీరే వాడాలి.
    వెంట్రుకలను దువ్వటం వల్ల రక్త ప్రసరణ పెరిగే మాట వాస్తవమే. కానీ అలాగని అదే పనిగా దువ్వినా వెంట్రుకలు చిట్లిపోతాయి.

అపోహలు, వాస్తవాలు
అపోహ: వెంట్రుకలు పెరగాలంటే రోజూ నూనె పెట్టాలి!
వాస్తవం: ఇది వట్టి అపోహ. శరీరం మీద పెరిగే ఇతర వెంట్రుకలు నూనె లేకుండానే నల్లగా పెరుగుతూనే ఉన్నాయిగా! అలాంటప్పుడు తల మీది వెంట్రుకలకు నూనె పెట్టాల్సిన అవసరమేముంది? పైగా జిడ్డు వెంట్రుకలున్నవారు నూనె పెడితే చుండ్రు సమస్య తలెత్తే ప్రమాదం ఉంది.
అపోహ: సీకాయ, కుంకుమ కాయ వాడటమే మేలు
వాస్తవం: ఇవి జిడ్డును చక్కగా తొలగిస్తాయి. అదే సమయంలో జుట్టును పొడిబారుస్తాయి. కాబట్టి జిడ్డు జుట్టు ఉన్నవాళ్లు వాడొచ్చు. పొడి జుట్టు ఉన్న వాళ్లు వీటిని వాడితే వెంట్రుకలు బిరుసెక్కుతాయి. షాంపూలు వాడినా వెంట్రుకలు చక్కగా శుభ్రపడతాయి.
అపోహ: రోజూ తలస్నానం అవసరం లేదు.
వాస్తవం: వ్యాయామం చేసేవాళ్లు, కాలుష్యపూరిత వాతావరణంలో పని చేసేవాళ్లు రోజూ తలస్నానం చేయటం వల్ల నష్టం లేదు. మిగతావాళ్లు రోజు విడిచి రోజు తలస్నానం తప్పక చేయాలి.
అపోహ: తలస్నానానికి ఏ నీరైనా ఫర్వాలేదు
వాస్తవం: తలస్నానానికి ఉప్పు నీరు మంచిది కాదు. ఈ నీటిలోని మినరల్స్‌ జుట్టుకు హాని కలిగిస్తాయి. కాబట్టి తల స్నానానికి మంచి నీరే వాడాలి.
అపోహ: హెయిర్‌ ప్యాక్స్‌ వాడటం వల్ల జుట్టుకు మేలు.
వాస్తవం: వీటి వల్ల వెంట్రుకలు మెత్తగా తయారవుతాయి తప్ప ప్రత్యేకంగా ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. ఇవి వాడకపోయినా నష్టం లేదు.

డాక్టర్‌ పి.స్వప్న ప్రియ
కన్సల్టెంట్‌ డర్మటాలజిస్ట్‌ అండ్‌ కాస్మటాలజిస్ట్‌,
కేర్‌ హాస్పిటల్స్‌, బంజారా హిల్స్‌, హైదరాబాద్‌.