మెరిసే కురుల కోసం..

08-01-2019:చలికాలంలో తల భాగంలో తేమ తగ్గిపోవడంతో శిరోజాలు పొడిబారడం, వెంట్రుకలు చిక్కులు పడడం వంటి సమస్యలు ఎదురవుతాయి. చలికాలంలోనూ మెరిసే కురులతో మురిసిపోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ఏ రకమైన జుట్టు ఉన్నవారికైనా ఈ చిట్కాలు చక్కగా పనిచేస్తాయి.
 
కొబ్బరి నూనె, నిమ్మరసం: టేబుల్‌స్పూను వేడి కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం వేయాలి. ఈ మిశ్రమంలో ముంచిన కాటన్‌ బాల్‌తో మసాజ్‌ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేయాలి.
 
నో హాట్‌బాత్‌: తల భాగం తేమగా ఉండాలంటే వేడి నీటి స్నానం చేయకూడదు. వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల తల భాగంలోని సహజ నూనెలు తొలగిపోయి, వెంట్రుకలు పొడిబారతాయి.
 
ఆయిల్‌: ఆలివ్‌ నూనె జుట్టుకు తేమను అందించి, కుదుళ్లకు పోషణనిస్తుంది. వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆలివ్‌ నూనెను కొద్దిగా వేడి చేసి, మాడుకు నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. తల భాగానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. వెంట్రుకలు రాలిపోవడం తగ్గిపోతుంది.
 
కండిషనింగ్‌: చలికాలంలో వారంలో ఒకసారైనా డీప్‌ కండిషనింగ్‌ చేసుకోవాలి. కేశాలకు నూనె రాసుకున్న తర్వాత కండిషనింగ్‌ చేసుకోవాలి. దీంతో వెంట్రుకలకు తేమతో పాటు పోషణ కూడా అందుతుంది. శిరోజాలు సుకుమారంగా మారతాయి.
 
జుట్టును ఆరబెట్టడం: వెంట్రుకలను సహజంగానే ఆరబెట్టుకోవాలి. జుట్టు తడిగా ఉన్నప్పుడు ముడి వేసుకోవడం వల్ల జట్టు కొసలు చిట్లిపోవడం, చుండ్రు సమస్యలు తలెత్తుతాయి. టవల్‌తో కేశాలను గట్టిగా రుద్దకూడదు.