తలకి రంగు ప్రమాదమే!

ఆంధ్రజ్యోతి,11-04-2017:జుత్తుకి రంగు వేసుకోవడం అనేది ఇప్పుడు ఓ ఫ్యాషన్‌ అయింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ తలకి రంగు వేసుకోవడం నామోషీగా భావించేవారు. ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా ఫ్యాషన్‌ పేరుతో రకరకాల రంగులు జుత్తుకు అప్లయ్‌ చేయడం యువతకు అలవాటుగా మారింది. అదే వారికి ప్రాణాంతకమవుతోంది అంటున్నారు ఫిన్‌లాండ్‌ పరిశోధకులు. యువతులు తలకి రంగు వేసుకోవడం వలన వారికి రొమ్ము కాన్సర్‌ వచ్చే అవకాశాలు 23 శాతం ఉన్న విషయం వీరి అధ్యయనంలో వెల్లడైంది. గర్భనిరోధక సాధనాలు ఉపయోగించడం, లేటు వయస్సులో బిడ్డకు జన్మనివ్వడం, పిల్లలకు పాలు ఇవ్వక పోవడం వంటి కారణాలు రొమ్ము కాన్సర్‌కు కారణమని వెల్లడయ్యింది. ఇప్పుడు తలకి వేసుకునే రంగు కూడా రొమ్ము కాన్సర్‌ రావడానికి కారణం అవుతుందని వారు అంటున్నారు. ఈ రంగులలో ఉపయోగించే రసాయనాలు దీనికి ప్రధానకారణం కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం మీద ఇంకా కొన్ని పరిశోధనలు నిర్వహించాల్సి ఉందని వారు చెబుతున్నారు.