నాకున్నది చుండ్రేనా?

నా వయసు 23 ఏళ్లు. నాలుగేళ్లుగా చుండ్రు సమస్యతో బాధపడుతున్నాను. చుండ్రును తగ్గిస్తాయంటూ చెప్పే పలురకాల షాంపూలు, మందులు ఎన్నో వాడాను. కానీ, ఏ ప్రయోజనమూ లేదు. ఇటీవలి కాలంలో చెవుల కింది భాగంలో చర్మం పెళుసులుగా మారుతోంది. బాగా దురదగా కూడా ఉంటోంది. ఇది చుండ్రేనా? మరేదైనా చర్మ వ్యాధా? అసలు నా సమస్య ఏమిటో... దీనికి పరిష్కారం ఏమిటో చెప్పండి? 

- ఎస్‌.నవీన్‌, అనంతపురం
 
మీరు రాసిన వివరాలను బట్టి మీకున్నది చుండ్రు సమస్య కాదనిపిస్తోంది. చెవుల దాకా పాకి దురద పెడుతుండడాన్ని బట్టి మీకున్న సమస్య సొరియాసిస్‌ అనిపిస్తోంది. అది చుండ్రా? సొరియాసిసా? అని తేల్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మీరు దువ్వుతున్నప్పుడు తలలోంచి తెల్లని పొడిలా రాలుతోందీ అంటే అది చుండ్రు అనుకోవచ్చు. ఒకవేళ చేపపొట్టులా పెళుసులు పెళుసులగా రాలుతోందీ అంటే అది సొరియాసిస్‌ అని అర్థం.
 
ఒకవేళ మీకున్నది సొరియాసిసే అయితే దానికి చుండ్రు షాంపూలు, మందుల వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు.. పైగా రోజులు గడిచే కొద్దీ ఈ వ్యాధి శరీరమంతా పాకి మరింత సమస్యగా మారవచ్చు. సొరియాసిస్‌ తీవ్రమైతే దురద, మంటలతో నిద్రకు కూడా దూరమవుతారు. నిద్రలేమితో నాడీ సమస్యలు, జీర్ణ సమస్యలు, మరికొన్ని ఇతర సమస్యలు కూడా మొదలవుతాయి. ఏమైనా పైపై పూతలతో ఈ సమస్య తొలగేది కాదు. పైపూతల మందులు అవసరమే అయినా కడుపులోకి ఆయుర్వేద మందులు కూడా ఇవ్వాలి. అప్పుడే సమస్య సమూలంగా తొలగిపోతుంది.
- డాక్టర్‌ సి. శరత్ కుమార్‌, ఆయర్వేద వైద్య నిపుణులు, రాజమండ్రి