తల రంగుతో రొమ్ము క్యాన్సర్‌?

ఆంధ్రజ్యోతి, 7-7-2017:తలకి వేసుకునే రంగుకీ, రొమ్ము క్యాన్సర్‌కి సంబంధం ఉందా అన్న అనుమానం వస్తోందా? ఉంది అంటున్నారు న్యూజెర్సీ పరిశోధకులు. హెయిర్‌ డైలలో లేత రంగుల కన్నా ముదురు రంగులే ఎక్కువ హాని కలిగిస్తాయని వీరు చెబుతున్నారు. ఆఫ్రికా, అమెరికా మహిళల మీద వీరు అధ్యయనం నిర్వహించారు. సుదీర్ఘకాలం పాటు వీరు జుత్తుకు ఉపయోగిస్తున్న రంగు, రిలాక్సర్ల గురించి అడిగి తెలుసుకున్నారు. వీరిలో కొందరు లేత రంగులు ఉపయోగిస్తుండగా, మరికొందరు ముదురు రంగులను జుత్తుకు ఉపయోగిస్తున్నారు. లేత రంగుల కన్నా ముదురు రంగులు జుత్తుకు ఉపయోగించిన వారిలోనే రొమ్ము క్యాన్సర్‌ లక్షణాలను వీరు గుర్తించారు. అయితే కేవలం జుత్తు రంగు కారణంగానే వీరిలో క్యాన్సర్‌ లక్షణాలు బయటపడ్డాయా? లేదా మరే కారణమైనా ఉందా? అన్న విషయాన్ని వీరు స్పష్టం చేయలేకపోతున్నారు. జుత్తుకు రంగు అనేది శిరోజాలకే కాకుండా శరీర ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుందని వీరు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా సెలూన్లకు వెళ్ళి జుత్తుకు రంగు వేయించుకోవడం మరింత ప్రమాదకరమని వీరు హెచ్చరిస్తున్నారు. జుత్తుకు రంగు వేసుకోవాలనుకుంటే రసాయన రహిత పదార్థాలనే ఉపయోగించాలని వీరు సూచిస్తున్నారు.